CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఈసారి ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారాలు అందజేశారు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం, ఉద్యమ కాలంలో ప్రజల మనసులను తాకిన గొప్ప కళాకారులను గుర్తించి వారికి ఈ సన్మానం జరిపారు. ఉద్యమ గేయాలతో ప్రజలను ఉద్యమ బాటపట్టించిన గద్దర్, సుద్దాల అశోక్ తేజ, అందెశ్రీ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావు వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Crime News: భర్త మూఢనమ్మకాలు భార్య ప్రాణాల మీదికి వచ్చింది!
దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరిలు ఇక లేరు గానీ, వారి త్యాగాలను గుర్తిస్తూ వారి కుటుంబ సభ్యులకు నగదు సత్కారం అందజేశారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కుమార్తె ఈ సత్కారం అందుకున్నారు. అదేవిధంగా బహుభాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఆయుధాల కన్నా కలం గొప్పది. పాటలు ప్రజల హృదయాల్లో తిరుగులేని ముద్ర వేశాయి. ఈ మహనీయుల సేవలకు ఇదొక చిన్న గుర్తింపు మాత్రమే అని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ గౌరవాలు నేటి తరం కళాకారులకు మార్గదర్శకంగా నిలవనివే. ప్రజల గుండెల్లో నిలిచిపోయే రచనలు, పాటలు, కవిత్వం ఈ ఉద్యమం విజయానికి మూలస్తంభాలుగా నిలిచినట్లు సీఎం వ్యాఖ్యానించారు.
