High Court

High Court: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టులో గ్రీన్‌ సిగ్నల్‌.. స్టే ఇవ్వడానికి నిరాకరణ!

High Court: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఆపేయడానికి నిరాకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జారీ చేసిన జీఓ 46ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

మేమే స్టే ఎలా ఇవ్వగలం?
పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తాము ఎటువంటి జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. “మేమే ఎన్నికలు నిర్వహించాలని గతంలో ఆదేశించాం. ఇప్పుడు మళ్లీ మేమే వాటిపై స్టే ఎలా ఇవ్వగలం?” అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ వైపు నుంచి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది.

రిజర్వేషన్ల అంశంపై స్పష్టత
ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా ఉప-వర్గీకరణ చేసి రిజర్వేషన్లు కేటాయించాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన కోర్టు, “సబ్-కేటగిరీ రిజర్వేషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికను రద్దు చేయాలని కోరుకుంటున్నారా?” అని ప్రశ్నించింది. గతంలో 42 శాతం రిజర్వేషన్ల జీఓ విచారణ జరుగుతున్న సమయంలో, పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని తామే సూచించినట్లు హైకోర్టు గుర్తు చేసింది. ప్రస్తుతం అదే పద్ధతిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోందని, కాబట్టి ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయలేమని, అవి యథావిధిగా కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *