Telangana: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బిల్లుల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి రూ. 713 కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధులను వెంటనే మంజూరు చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనుంది.
గతంలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం ప్రతి నెలా రూ. 700 కోట్ల చొప్పున పెండింగ్ బకాయిలను తీరుస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం వరుసగా నిధులను విడుదల చేస్తోంది. జూన్ నెలలో రూ. 183 కోట్లతో మొదలుపెట్టి, ఆగస్టు నుండి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ. 700 కోట్లకు తగ్గకుండా నిధులను కేటాయిస్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన రూ. 713 కోట్లు కూడా ఈ క్రమంలో భాగమే.
ఈ నిధులతో ఉద్యోగులకు సంబంధించిన ఎన్నో ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కానున్నాయి. ముఖ్యంగా రిటైర్ అయిన వారికి వచ్చే గ్రాట్యూటీ, ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) అమౌంట్, సరెండర్ లీవులు, మరియు ఇతర అడ్వాన్స్‌లకు సంబంధించిన క్లెయిమ్‌లు క్లియర్ అవుతాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గమనించి, ఈ ‘ప్రజా ప్రభుత్వం’ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ నిధులను విడుదల చేసిందని ఆర్థిక శాఖ పేర్కొంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం నిధులు కేటాయించడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
