Sankranti Toll Fee: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగైన సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చేందుకు సిద్ధమైంది. పండుగ రద్దీ కారణంగా హైవేలపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు ఎదుర్కొనే నరకయాతనకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారితో పాటు రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా విన్నవించింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. జనవరి 9 నుంచి 14వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు, అలాగే రాష్ట్రంలోని కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపడం వల్ల ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
