Telangana: తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీపి కబురు అందించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేస్తూ, పండుగ సెలవులను జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పొడిగించారు. అంటే ఈ నెల 10వ తేదీ శనివారం నుంచి 16వ తేదీ గురువారం వరకు మొత్తం ఏడు రోజుల పాటు బడులకు సెలవు ఉండనుంది.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్లో హిందువుల రక్షణ ప్రశ్నార్థకం!
ముఖ్యంగా జనవరి 15న సంక్రాంతి పండుగ ఉండగా, దాని మరుసటి రోజు అంటే 16వ తేదీన ‘కనుమ’ పండుగను ప్రభుత్వం ఐచ్ఛిక సెలవుగా గుర్తించింది. పండుగ జరుపుకోవడానికి సొంత ఊర్లకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం 16వ తేదీని కూడా సెలవు జాబితాలో చేర్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
సెలవుల అనంతరం జనవరి 17వ తేదీ శుక్రవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇటు పండుగ సంబరాలు, అటు ప్రయాణ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఉత్తర్వులను పాటించాలని అధికారులు ఆదేశించారు.
