Revanth Reddy: ఎండైనా, వానైనా, అర్ధరాత్రి అయినా సరే.. మనం ఒక్క క్లిక్ చేయగానే మన ఇంటి గుమ్మం ముందుకు ఫుడ్, గ్రాసరీస్, రైడ్స్ తీసుకొచ్చే గిగ్ వర్కర్లకు (స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, ర్యాపిడో డెలివరీ పార్టనర్లు) తెలంగాణ ప్రభుత్వం భారీ భరోసా ఇచ్చింది! దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం (నవంబర్ 14) హైదరాబాద్‌లోని జయభేరీ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ‘తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకం’ విధివిధానాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లకు రూ. 5 లక్షల జీవిత బీమాతో పాటు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది!
గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రధాన ప్రయోజనాలు..
ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగ భద్రత, గుర్తింపు లేకుండా పనిచేస్తున్న డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు ఈ కొత్త చట్టం ద్వారా చట్టబద్ధమైన రక్షణ లభించనుంది.
-
రూ. 5 లక్షల జీవిత బీమా (Life Insurance): విధి నిర్వహణలో ఉన్నప్పుడు లేదా దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి గిగ్ వర్కర్ ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబానికి ఆర్థిక అండగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు.
-
రూ. 10 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద గిగ్ వర్కర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభించనుంది.
-
చట్టబద్ధమైన గుర్తింపు: కష్టానికి తగిన ఆదాయం, సామాజిక భద్రత కల్పించేలా వివిధ రంగాల నిపుణులు, వర్కర్ల సలహాలు తీసుకుని ఈ ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు.
రాహుల్ గాంధీ మాటిస్తే మట్టిలో కలిసినా తప్పరు!.. సీఎం రేవంత్ రెడ్డి.
జయభేరీ గ్రౌండ్స్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గిగ్ వర్కర్ల కష్టాలను గుర్తుచేసుకున్నారు. గతంలో గిగ్ వర్కర్లు రాహుల్ గాంధీని కలిసి తమకు చట్టపరమైన రక్షణ, గుర్తింపు లేవని తమ బాధలు చెప్పుకున్నారు. వారికి తప్పకుండా న్యాయం చేస్తామని నాడు రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఆయన చేతుల మీదుగానే ఈ చారిత్రాత్మక చట్టాన్ని అమలు చేస్తున్నాం అని సీఎం తెలిపారు. రాహుల్ గాంధీ ఒక్కసారి మాటిస్తే మట్టిలో కలిసినా మాట తప్పరు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.
హైదరాబాద్ రోడ్లపై ఉత్సాహంగా బైక్ ర్యాలీ – గిగ్ వర్కర్లతో రాహుల్ ముఖాముఖి.
సభకు ముందు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జయభేరీ గ్రౌండ్స్‌లో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో నేరుగా ముఖాముఖి నిర్వహించి, వారి రోజువారీ సమస్యలు, ఆదాయ ఇబ్బందులు, డిమాండ్ల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
