Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన మాజీ హోంగార్డు టవర్ పైకెక్కి హల్‌చల్ చేశాడు. తమను విధుల్లోకి తీసుకోనందుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో తొలగింపునకు గురైన తనతోపాటు 250 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
Telangana: ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించిన వీరాంజనేయులు హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ఉమ్మడి ప్రభుత్వం తమపై కక్షగట్టి సుమారు 250 మందిని విధుల నుంచి అన్యాయంగా తొలగించిందని వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు. సీమాంధ్ర పాలకుల వివక్షకు తామందరం బలయ్యామని తెలిపాడు. తమకందరికీ సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతాలు, హెల్త్ కార్డులు ఉన్నాయని తెలిపాడు.
Telangana: గత ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిందని, ఇప్పటికి ఏడాది గడుస్తున్నా, పట్టించుకోవడం లేదని వీరాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశాడు. తమ గురించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి 250 మందిని విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని వీరాంజనేయులు టవర్ పైనుంచి ప్రభుత్వాన్ని కోరాడు. రోడ్డున పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని వేడుకున్నాడు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు.