TDP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించి, రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణలో ప్రాతినిథ్యం తగ్గిన టీడీపీ మళ్లీ పుంజుకునేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నది. 1983 నుంచి ఎన్టీఆర్ హయాంలో, అనంతరం చంద్రబాబు హయాంలో తెలంగాణలో టీడీపీ ఓ వెలుగు వెలిగింది. ఊరూరా పటిష్ఠ క్యాడర్‌ను కలిగి విశేష ప్రజాబలాన్ని కలిగి ఉన్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీడీపీ వైఖరి, అనంతర పరిణామాలతో ఇక్కడ వెనుకబడింది. ఆ తర్వాత ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
TDP: ఈ నేపథ్యంలో మళ్లీ తెలంగాణలో పాగా వేసేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో పాదుకునేందుకు రాజకీయ వ్యూహాల గురించి ప్రణాళికలు రచించే పనిలో నిమగ్నమయ్యారని తెలిసింది. ఈ మేరకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్, పొలిటికల్ స్ట్రాటజీ కంపెనీ కంపెనీ షోటైమ్ రాబిన్ శర్మలను తాజగా చంద్రబాబు నాయుడు తన తనయుడు నారా లోకేశ్‌తో కలిసినట్టు సమాచారం.
TDP: తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ కూడా బలంగా ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా వాటన్నింటినీ అధిగమించేందుకు ప్రణాళికలు రచించే విధంగా వ్యూహాలు పన్నేందుకు టీడీపీ అగ్రనేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తొలుత పాగా వేయాలని నిర్ణయించారు. త్వరలో జరిగే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం సాధించాలని భావిస్తున్నారు.
TDP: దీంతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేపీహెచ్‌బీ, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో టీడీపీ సభ్యత్వ క్యాంపెయిన్‌ను చేపట్టారు. నగరంలో పట్టున్న ప్రాంతాల్లో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా క్యాడర్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు వారి కదలికలు కనిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సొంతంగానైనా, లేదా బీజేపీ, జనసేన పొత్తుతోనైనా మళ్లీ పూర్వవైభవం కోసం టీడీపీ ప్లాన్ చేస్తున్నది.