Pinnamaneni Saibabu: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను భుజాన మోసిన నిఖార్సైన కార్యకర్త, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబు (69) హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్యంతో ఉన్న ఆయన, రాత్రి 11 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
పిన్నమనేని సాయిబాబు కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఎన్టీఆర్ వీరాభిమానిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సికింద్రాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి వెలకట్టలేనిది. గతంలో ఆయన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించి, దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వెనుకాడకుండా ముందుండి నడిపించిన సైనికుడిగా ఆయనను కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు.
సాయిబాబు గారి మరణం పట్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నందమూరి రామకృష్ణ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. “మా కుటుంబానికి సాయిబాబు ఎంతో ఆత్మీయుడు. ఆయన మరణం పార్టీకి, అభిమానులకు తీరని లోటు” అంటూ రామకృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు. సాయిబాబు గారి అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లోని అంబర్‌పేట శ్మశానవాటికలో కుటుంబ సభ్యులు, పార్టీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి.
