Nellore: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ రగడ మరోసారి హింసాత్మకంగా మారింది. ముత్తుకూరు మండల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు ఎదనపర్తి శ్యాంసుందర్ రెడ్డి (శ్యామన్న)పై దారుణంగా కత్తులతో దాడి జరిగింది. అక్రమంగా నిల్వ చేసిన మద్యం డంప్‌ల గురించి సమాచారం ఇచ్చాడనే కక్షతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పంటపాళెం గ్రామంలోని తన ఇంట్లో ఉన్న శ్యాంసుందర్ రెడ్డిని బయటికి పిలిచి. అతను బయటికి రాగానే, వైసీపీ నాయకులు విచక్షణారహితంగా కత్తులతో దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల ప్రజలు గమనించి రావడంతో, దాడి చేసినవారు అక్కడి నుండి పారిపోయారు. తీవ్రమైన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్యాంసుందర్ రెడ్డిని వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అతని నడుము నుండి వెన్నెముక వరకు కత్తిపోట్లు దిగినట్లు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్సలు చేసి వైద్యులు అతని ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Cm chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047 దిశగా రాష్ట్రం పయనం
Nellore: ఈ దాడికి ప్రధాన కారణం రాజకీయ కక్ష సాధింపేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 2024 ఎన్నికల సమయంలో పంటపాళెంలో వైసీపీ నాయకుడు, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమంగా 4 వేల మద్యం సీసాలను నిల్వ ఉంచగా, శ్యాంసుందర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకే వాటిని స్వాధీనం చేసుకున్నారు. శ్యాంను పొడిచిన వైసీపీ నాయకుడు పోలూరు లెనిన్, కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ నేతలు అక్రమ మద్యం కేసులో నిందితులుగా ఉన్నారు. అక్రమ మద్యం డంపుల సమాచారం ఇచ్చాడనే కక్షతోనే కాకాణి అనుచరులు శ్యాం ప్రాణం తీయడానికి ప్రయత్నించారని టీడీపీ ఆరోపణ.
ఇలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని సర్వేపల్లి ప్రజలు, వివిధ రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.