AP News: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ రాయలసీమ ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) తెలుగుదేశం పార్టీ నేతలు అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీడీపీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, పంచుమర్తి అనురాధ, అశోక్‌బాబు ఎన్నికల కమిషన్‌ను కలిసి రాయలసీమలోని పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి తదితర ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు సృష్టించిన విధ్వంసంపై లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎస్ఈసీని కోరారు.
పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఎంపీ మిథున్‌రెడ్డి తన అనుచరులతో కలిసి దాడులకు తెగబడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలపైకి మిథున్‌రెడ్డి కాన్వాయ్ అతివేగంగా దూసుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలను, ఫొటో ఆధారాలను ఎన్నికల కమిషనర్‌కు నేరుగా అందజేశారు. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, బాధ్యులపై చట్టపరమైన కేసులు నమోదు చేయించాలని టీడీపీ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.
