TDGP: హిడ్మా మృతి అనంతరం ఆయన స్థానంలో బర్సె దేవాను మావోయిస్టు పార్టీ నియమించినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. ఆయుధాల సేకరణ, మావోయిస్టు కార్యకలాపాల నిర్వహణలో బర్సె దేవా కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా గుర్తింపు ఉన్నాడని వెల్లడించారు. హిడ్మా తర్వాత PLGA బెటాలియన్‌ను ముందుకు నడిపించే బాధ్యతలు దేవాకు అప్పగించినట్లు తెలిపారు.
అయితే తాజాగా బర్సె దేవాతో పాటు 48 మంది మావోయిస్టులు లొంగిపోవడం భద్రతా బలగాలకు పెద్ద విజయంగా డీజీపీ పేర్కొన్నారు. ఈ లొంగుబాటు కారణంగా PLGA బెటాలియన్ పూర్తిగా కూలిపోయినట్లే అని ఆయన స్పష్టం చేశారు. ఇది మావోయిస్టు సంస్థ నిర్మాణానికి తీవ్ర దెబ్బగా అభివర్ణించారు.
లొంగిపోయిన మావోయిస్టులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రివార్డులు, పునరావాస సౌకర్యాలు అందిస్తామని డీజీపీ శివధర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శాంతి మార్గాన్ని ఎంచుకునేవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
