TANA Youth Conference: తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) 24వ మహాసభల్లో ఈ సారి యువతరంగం ఉరకలేయనున్నది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే తానా మహాసభలు ఈసారి అమెరికాలోని డెట్రాయిట్‌లోని నోవై సబర్బన్ షో ప్లేస్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 3, 4, 5 తేదీల్లో మహాసభలు జరుగుతాయి. ఈ సభలకు అమెరికాలోని నలుమూలల నుంచి తెలుగు వారితోపాటు అమెరికా దేశస్తులు, భారతీయులు, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ సారి తరతరాల తెలుగుదనం- తరలివచ్చే యువతరం అనే ఇతివృత్తంతో జరిగే తానా మహాసభలు ఈసారి సరికొత్త శోభను సంతరించుకోనున్నాయి. తొలిసారిగా తానా మహాసభల్లో యువత కోసం డెట్రాయిట్‌లోని నోవై సబర్బన్ షో ప్లేస్ వేదికగా ప్రత్యేక యూత్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద యూత్ ఈవెంట్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని యూత్ కాన్ఫరెన్స్ చైర్మన్ విశాల్ బెజవాడ మహాన్యూస్‌తో మాట్లాడుతూ తెలిపారు.
ఈ యూత్ కాన్ఫరెన్స్‌లో 19 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసుండి అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయ యువకులతో ఈ సదస్సును నిర్వహించనున్నట్టు యూత్ కాన్ఫరెన్స్ చైర్మన్ విశాల్ బెజవాడ వెల్లడించారు. మహాసభ అంతటికీ ఈ యూత్ కాన్ఫరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. అమెరికాలో నివసించే భారతీయ యువకులను ఒకేవేదికపైకి తీసుకురావడంతోపాటు వారు ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకునేలా ఈ వేదిక దోహదం చేస్తుందని తెలిపారు.
యువతలో నైపుణ్యాన్ని వెలికితీయడంతోపాటు జీవితంలో వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సరైన మార్గదర్శనం ఈ సదస్సులో యువతీ యువకులకు లభిస్తుందని విశాల్ బెజవాడ తెలిపారు. ఆ తర్వాత భావి జీవితంలో యువత ఒకరికొకరు పరస్పర సహకారంతో ముందుకు సాగేలా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. దీనికోసం స్ఫూర్తినిచ్చే ఉపన్యాసాలు, యువతను ఆకట్టుకునే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ వేడుకలో పాల్గొనే యువత కోసం జూన్ 8లోగా రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కల్పించారు.
డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఇతర ప్రాంతాల వారికీ ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. ఈ మేరకే నిర్వాహకులు మహాసభలను డెట్రాయిట్‌ను ఎంపిక చేశారు. ఈ మహాసభల్లో తెలుగుదనం ఉట్టిపడేలా కార్యక్రమాలకు నిర్వాహకులు రూపకల్పన చేస్తున్నారు.