Tamil Nadu: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం హద్దులు దాటి చేసే ప్రదర్శనలు చివరకు ఎలాంటి ప్రమాదాల్లోకి నెడతాయో చెప్పేందుకు తమిళనాడులో జరిగిన ఈ ఘటనే తాజా నిదర్శనం. సోషల్ మీడియాలో కిలోల కొద్దీ బంగారం, కట్టల కొద్దీ డబ్బులు చూపిస్తూ రీల్స్, వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అయిన ప్రముఖ తమిళ యూట్యూబర్ మధుమిత కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
ఆమె ఇంట్లో సుమారు రూ.కోటి విలువైన భారీ చోరీ జరిగిన కొద్ది రోజులకే.. స్వయంగా ఆమెపైనే ఒక వృద్ధ కాంట్రాక్టర్ నుంచి బంగారం దోచుకుందనే కేసు నమోదు కావడం, పోలీసుల విచారణకు భయపడి ఆమె కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి పరారవ్వడం తమిళనాట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
రీల్స్ మోజుతో కొనితెచ్చుకున్న చోరీ..
కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మత్తుక్కోణం గ్రామానికి చెందిన మధుమిత.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో గ్లామరస్ వీడియోలు, ప్రమోషనల్ వీడియోలతో వేలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.
తాను సంపాదించిన డబ్బును, ఇంట్లో ఉన్న భారీ బంగారు ఆభరణాలను, నగదు కట్టలను తరచూ కెమెరా ముందు ప్రదర్శిస్తూ ఆమె వ్లాగ్స్ చేసేది. ఈ వీడియోలు చూసిన నలుగురు దొంగలు ఆమె ఇంటిని టార్గెట్ చేశారు. ఇటీవల మధుమిత తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో.. గ్యాస్ కట్టర్లతో తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని లాకర్లలో ఉన్న సుమారు 118 సవర్ల బంగారు నగలను (విలువ దాదాపు రూ.కోటి) దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 98 సవర్ల బంగారాన్ని రికవరీ చేశారు.
ఊహించని ట్విస్ట్.. బాధితురాలే నిందితురాలిగా మారిన వైనం!
దొంగతనం కేసు ఒక కొలిక్కి వస్తున్న సమయంలోనే ఈ కథలోకి ఒక ఊహించని మలుపు వచ్చింది. తిరునెల్వేలికి చెందిన 89 ఏళ్ల సీనియర్ బిల్డింగ్ కాంట్రాక్టర్ పేచ్చిముత్తు పోలీసులను ఆశ్రయించి మధుమితపై సంచలన ఫిర్యాదు చేశారు.
2022లో మధుమిత తనతో పరిచయం పెంచుకుందని, ఒకసారి కారులో ప్రయాణిస్తున్న సమయంలో తన మెడలోని 5 సవర్ల బంగారు గొలుసును బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. ఆ గొలుసును తిరిగి ఇవ్వాలని అడిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ తనను బెదిరించిందని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా రాజాక్కమంగళం పోలీసులు మధుమితపై క్రిమినల్ కేసు (FIR) నమోదు చేశారు.
పోలీసుల రాకతో షాక్.. భర్త, కూతురితో పరార్..
కేసు విచారణలో భాగంగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని పోలీసులు పిలవగా ఆమె స్పందించలేదు. దీంతో రాజాక్కమంగళం పోలీసులు నాగర్‌కోవిల్‌లోని ఆమె ఇంటికి వెళ్లగా.. ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉండటాన్ని చూసి విస్తుపోయారు..
-
ఒకవైపు ఇంట్లో జరిగిన చోరీ తాలూకు ఆస్తుల లెక్కలు, మరోవైపు తనపై నమోదైన రాబరీ కేసుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. మధుమిత తన భర్త వినోద్ కుమార్, కుమార్తెతో కలిసి అదృశ్యమైనట్లు పోలీసులు నిర్ధారించారు.
-
ఆమె మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ రావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఆమె ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
సోషల్ మీడియాలో డబ్బు, బంగారం చూపిస్తూ షో చేసిన యూట్యూబర్.. ఇప్పుడు వరుస కేసులు, పోలీసుల విచారణకు భయపడి పరారీలో ఉండటం నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
