Tamil Nadu

Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ సీఎం అవుతారా? ఆ ఆరుగురు ఎమ్మెల్యేలే కీలకం!

Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తున్నాయి. ప్రముఖ నటుడు, తమిళనాడు వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది ఇప్పుడు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల చేతుల్లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, అందరి కళ్లు సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నిర్ణయంపైనే ఉన్నాయి. ఈ చిన్న పార్టీలు ఇచ్చే మద్దతే విజయ్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతోంది.

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, విజయ్ పక్షాన ప్రస్తుతం 107 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి ఆయనకు మరో 11 మంది సభ్యుల బలం కావాలి. ఈ క్రమంలోనే సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలకు ఉన్న చెరి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు అత్యంత కీలకంగా మారింది. వీరు గనుక మద్దతు ఇస్తే విజయ్ బలం పెరిగి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది.

మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి తీసుకున్న నిర్ణయం ఈ ఉత్కంఠను మరింత పెంచింది. సభలో ప్రత్యక్షంగా బలం నిరూపించుకోవాలని, కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారికే అవకాశం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో విజయ్ ఇప్పటికే ఆయా పార్టీల నేతలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నేడు సాయంత్రం ఆ పార్టీలు తీసుకోబోయే నిర్ణయంపైనే తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఆధారపడి ఉంది.

ఒకవేళ ఈ చిన్న పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వకపోతే, తమిళనాడులో ఊహించని మార్పులు వచ్చే అవకాశం ఉంది. బద్ధశత్రువులైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? అన్న చర్చ కూడా మొదలైంది. అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఇప్పటికే తన ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడం, తన పార్టీ ఎమ్మెల్యేలను పుదుచ్చేరి రిసార్ట్‌కు తరలించడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఒకవేళ ప్రత్యర్థి పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే, విజయ్ కూడా తగ్గకూడదని నిర్ణయించుకున్నారు. తనకున్న 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామా చేయించి, రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ తీరుపై టీవీకే, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇది బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ అని ఆరోపిస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి నేడు వెలువడే నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసేలా ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *