Prashant Kishor: గతేడాది జరిగిన టీవీకే భారీ బహిరంగ సభలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. అప్పట్లో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే..
“తమిళనాడులో ఎం.ఎస్. ధోనీకి ఎంతటి ఆదరణ ఉందో మనందరికీ తెలుసు. కానీ, వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీని గెలిపించిన తర్వాత, ప్రజలందరూ నా వ్యూహాల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు నేను ధోనీ కంటే ఎక్కువ ఫేమస్ అవుతాను.”
నేటి ఫలితాలు చూస్తుంటే, పీకే చెప్పినట్లే విజయ్ మేనియాను ఓట్లుగా మార్చడంలో ఆయన వంద శాతం విజయం సాధించినట్లు కనిపిస్తోంది. కేవలం ఏడాదిన్నర కాలంలోనే ఒక కొత్త పార్టీని అధికార పీఠం దరిదాపుల్లోకి తీసుకురావడం పీకే వ్యూహరచనకు నిదర్శనం.
విజయ్ విజయానికి పీకే అందించిన ‘సక్సెస్ మంత్ర’ ఇదే:
-
యూత్ కనెక్ట్: తమిళనాట ఉన్న అపారమైన యువశక్తిని, విజయ్ ఫ్యాన్ బేస్‌ను వ్యవస్థీకృత ఓటు బ్యాంకుగా మార్చడంలో పీకే తనదైన ముద్ర వేశారు.
-
న్యూట్రల్ ఓటింగ్: అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకే.. రెండింటిపై అసంతృప్తిగా ఉన్న తటస్థ ఓటర్లను (Neutral Voters) టీవీకే వైపు తిప్పుకోవడంలో పీకే సక్సెస్ అయ్యారు.
-
డిజిటల్ డామినేషన్: క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయడంతో పాటు, సోషల్ మీడియాలో “మార్పు” (Change) అనే నినాదాన్ని బలంగా వినిపించారు.
-
క్షేత్రస్థాయి సర్వేలు: ప్రతి నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటిపై విజయ్ చేత స్పష్టమైన హామీలు ఇప్పించడం ఓటర్లను ఆకర్షించింది.
ద్రవిడ రాజకీయాల్లో కొత్త శకం
గత 50 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలు కేవలం రెండు పార్టీల మధ్యే తిరుగుతున్నాయి. కానీ నేడు విజయ్ సాధించిన ఈ విజయం, ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికి ఒక కొత్త శకానికి నాంది పలికినట్లయింది. ముఖ్యంగా స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే మూడో స్థానానికి పడిపోవడం అనేది ఆ పార్టీకి పెద్ద హెచ్చరికగా మారింది.
