Tapsee Pannu: సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు.. స్టార్ ఫ్యామిలీల సపోర్ట్ లేదు.. అయినా తనదైన టాలెంట్, కష్టపడే తత్వంతోనే స్టార్ డమ్ సాధించింది తాప్సీ పన్ను. లేడీ ఓరియంటెడ్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్లు, కమర్షియల్ ఎంటర్టైనర్లతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న వివక్ష, నెగెటివిటీపై కుండబద్దలు కొట్టింది. ఎలాంటి అండదండలు లేకుండా ఒక సాధారణ అమ్మాయి టాప్ పొజిషన్‌కు చేరడాన్ని ఇండస్ట్రీలోని కొందరు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
డంకీలో నేనెలా వచ్చానో ఎవరికీ అర్థం కాలేదు
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ సరసన దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘డంకీ’ సినిమాలో లీడ్ రోల్ ఆఫర్ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన రియాక్షన్లను తాప్సీ గుర్తుచేసుకుంది.
“ఇండస్ట్రీలో ఎవరైనా సక్సెస్ అయితే చాలు.. ‘ఆమె వెనుక గాడ్‌ఫాదర్ ఉన్నాడు, ఫలానా స్టార్ ఫ్యామిలీ బ్యాకింగ్ ఉంది, ఒక పెద్ద స్టూడియో సపోర్ట్ ఉంది’ అని చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. కానీ నా విషయంలో ఇవేవీ నిజం కావు. నాకు ‘డంకీ’ చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చినప్పుడు చాలామంది మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఆమెకు ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? అంటూ వింతగా చూశారు. నేను షారూఖ్ సర్ ఫ్రెండ్స్ సర్కిల్లో లేను.. డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో అంతకుముందు కలిసి పని చేయలేదు.”
ఒక్క ఫోన్ కాల్‌తో మారిన సీన్
రాజ్‌కుమార్ హిరానీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు గురించి మాట్లాడుతూ.. “గతంలో నేను చేసిన ఒక పాత్రను ఎలా చేశానో తెలుసుకోవడానికి ఆయన నన్ను ఆఫీస్‌కు పిలిచారు. ఆ తర్వాత చాలా రోజులకు మళ్లీ ఫోన్ చేసి, ‘డంకీ కథ వింటారా?’ అని అడిగారు. అది వినగానే నేను నిజంగా నమ్మలేకపోయాను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లోకి నేను రావడం చాలామందికి అస్సలు నచ్చలేదు” అని తాప్సీ వెల్లడించింది.
నాపై ఫేక్ ప్రచారాలు చేశారు.. క్యారెక్టర్‌ను బాక్స్‌లో పెట్టలేరు
తన ఎదుగుదలను ఓర్వలేని కొందరు తనపై కావాలనే లేనిపోని కథలు అల్లారని తాప్సీ మండిపడింది. నన్ను ఏ మూస పద్ధతిలోనూ బంధించలేరు. నా వ్యక్తిగత విషయాలు ఎవరికీ పెద్దగా తెలియకపోవడం వల్లే నా గురించి ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేశారు.
ఈమెతో పనిచేయడం చాలా కష్టం’, ‘ఆమెతో ఎవరూ వర్క్ చేయాలనుకోరు’, ‘ఆమెకు రకరకాల సమస్యలు ఉన్నాయి’ అంటూ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఎదిగితే దానికి ఒక సుపరిచితమైన కారణాన్ని వెతకడం అలవాటైపోయిందని, కానీ ఏ కారణం లేకుండా కేవలం సొంత ప్రతిభతో నిలబడినప్పుడు ఇలాంటి పుకార్లు పుట్టిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.
2013లో ‘చష్మే బద్దూర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన తాప్సీ.. కేవలం తన కష్టాన్ని, నటనను నమ్ముకునే ఈ స్థాయికి చేరుకున్నానని, దీనికి తాను ఎంతో గర్వపడుతున్నానని స్పష్టం చేసింది. ఎవరికీ భయపడకుండా, తన నిబంధనల ప్రకారమే ఇండస్ట్రీలో కొనసాగుతానని ఆమె తేల్చిచెప్పింది.
