Sydney Shooting: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన నిందితుల్లో ఒకడైన సాజిద్ అక్రమ్ (50) స్వస్థలం హైదరాబాద్ అని తెలంగాణ డీజీపీ కార్యాలయం తాజాగా స్పష్టం చేసింది. డిసెంబర్ 14న (ఆదివారం) సిడ్నీలోని బోండీ బీచ్‌లో యూదుల ‘హనుక్కా’ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తెలంగాణ డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకాం వరకు చదువుకున్నాడు. అనంతరం 1998లో సుమారు 27 ఏళ్ల క్రితం విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. వలస వెళ్లాక, సాజిద్ ఒక యూరోపియన్ యువతి వెనెరా గ్రోసోను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు నవీద్ అక్రమ్, 24 మరియు ఒక కుమార్తె ఉన్నారు. అయితే, వారందరూ ఆస్ట్రేలియా పౌరులే. సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్‌పోర్టునే వినియోగిస్తున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించారు.
Also Read: TTD Board: తిరుమల: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
సాజిద్ ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత ఆరుసార్లు భారత్‌కు వచ్చి వెళ్ళాడు. ఈ పర్యటనలు కేవలం కుటుంబ వ్యవహారాలు, ఆస్తులకు సంబంధించిన పనుల కోసమేనని డీజీపీ కార్యాలయం తెలిపింది. సాజిద్ 1998కు ముందు హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతనిపై ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీసులు నిర్ధారించారు.
ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS) భావజాలంతో వీరికి సంబంధాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ దాడికి సంబంధించిన రాడికలైజేషన్ (తీవ్రవాద భావాలు)కు భారత్‌తో లేదా తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. అలాగే, సాజిద్ ఉగ్రవాద సంబంధాలపై తమకు ఏమీ తెలియదని హైదరాబాద్‌లోని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
ఈ ఉగ్రదాడికి సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ ఇద్దరూ పాల్పడినట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ అక్రమ్ హతమవ్వగా, కుమారుడు నవీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. నిఘా వర్గాలు సాజిద్ ప్రయాణ చరిత్రను పరిశీలిస్తున్నాయి. వాస్తవాలు పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు అనవసర ఊహాగానాలకు దూరంగా ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రజలను కోరారు.
