Stalin: తెలంగాణలో ఇటీవల లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ ఆమోదించిన తీర్మానం పై తమిళనాడు ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్ స్పందించారు. చెన్నైలో లేవనెత్తిన ఆకాంక్షలకు హైదరాబాద్‌లో ప్రాతిపదిక ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. పారదర్శకమైన డీలిమిటేషన్ న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని చాటుతుందని స్టాలిన్ పేర్కొన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టాలని భావిస్తున్న డీలిమిటేషన్ చట్టం ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే చర్యలకు దారి తీస్తుందని ఆయన విమర్శించారు. చెన్నైలో ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశం, తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానం కేవలం ఆరంభమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ తీసుకున్న ఈ చర్యను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయని ఆకాంక్షించారు.
హైదరాబాద్‌లో త్వరలో రెండో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం జరగనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. దేశ భవిష్యత్తును అన్యాయంగా మార్చే ప్రయత్నాలను తాము సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభలో తీర్మానం ఆమోదించడం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు.