TTD Srivani Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. వరుస సెలవులు రావడంతో ప్రస్తుతం కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కలగడానికి సుమారు 30 గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు ఆఫ్ లైన్ కౌంటర్లలో ఇచ్చే శ్రీవాణి దర్శన టికెట్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు ఈ టికెట్లు అందుబాటులో ఉండవు. ఇప్పటికే డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు కూడా టికెట్లు జారీ చేయకూడదని టీటీడీ నిర్ణయించింది. భారీ రద్దీ కారణంగా క్యూలైన్లు నిండిపోవడంతో, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే టీటీడీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
అయితే, జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కేవలం ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు. తిరిగి జనవరి 9 నుంచి శ్రీవాణి టికెట్లను యథావిధిగా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో బోర్డు ఉంది. భవిష్యత్తులో కూడా ఆఫ్ లైన్ పద్ధతిని పూర్తిగా తీసేసి, కేవలం ఆన్ లైన్ ద్వారానే టికెట్లు ఇచ్చేలా టీటీడీ ప్లాన్ చేస్తోంది. రోజుకు 1000 టికెట్లను ఆన్ లైన్ లో ఒకరోజు ముందుగా విడుదల చేయాలని భావిస్తోంది. దీనివల్ల తిరుమల మరియు రేణిగుంట విమానాశ్రయంలో ఉన్న కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
