Srisailam Temple: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని శ్రీశైలం ఆలయంలో వారం రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. జనవరి 12 నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఈ ఏడు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఏటా జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ఉత్సవాలలో పాల్గొని, స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు.
Srisailam Temple: జనవరి 12వ తేదీన ఉదయం 9.15 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. చండీశ్వరునికి విశేష పూజలు జరిపిస్తారు. ఈ పూజలతోనే బ్రహ్మోత్సవాలు ఆరంభం అవుతాయి. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక పూజలతో స్వామి, అమ్మవార్లను అలంకరిస్తారు. ఆయా సమయాల్లో ఆలయంలో ఉత్సవ శోభ సంతరించుకోనున్నది.
Srisailam Temple: ఉత్సవాలు ప్రారంభమైన మరుసటి రోజైన జనవరి 13 నుంచి స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15వ తేదీన మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపిస్తారు. 17న యాగ పూర్ణాహుతి, 18న పుషోపత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల సందర్భంగా జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలుపుదల చేస్తారు.
