Tragedy

Tragedy: డ్యామ్ చూసేందుకు వెళ్లి ఐదుగురు మహిళలు మృతి..!

Tragedy: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద తీరని విషాదం చోటుచేసుకుంది. సరదాగా డ్యామ్‌ను చూసేందుకు వెళ్లిన ఐదుగురు మహిళలు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. రిజర్వాయర్ గట్టు వద్ద సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసిన వారు, ఆ ఉత్సాహంలో క్రమంగా నీటిలోకి దిగారు. అయితే, అక్కడ నీటి లోతుతో పాటు బురద తీవ్రతను సరైన రీతిలో అంచనా వేయలేకపోవడంతో ఒక్కొక్కరుగా అందులోనే చిక్కుకుపోయారు.

బురదలో కూరుకుపోయి బయటకు రాలేక తీవ్రంగా పెనుగులాడిన బాధితులు, చూస్తుండగానే ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే తీవ్ర జాప్యం జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను పుష్ప, గాయత్రి, హసీనా, మాహీన్, హాసినిలుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. విగతజీవులైన తల్లుల కోసం చిన్నారులు అమాయకంగా వెతుకుతున్న దృశ్యాలు చూపరులను కలచివేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *