Sri Rama Navami: శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిథిలా మండపం కొత్త సొబగులతో మిరుమిట్లు గొలుపుతున్నది. ఆలయ మాఢ వీధులు అందంగా అలంకరించబడ్డాయి. మొత్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకున్నది.
Sri Rama Navami: భద్రాచలంలో ఏప్రిల 6న సీతారాముల కల్యాణ మహోత్సవం కనుల విందుగా జరగనున్నది. ఈ వేడుకను కనులారా చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తకోటి పోటెత్తనున్నది. ఈ మేరకు సీతారాములు ఆశీనులయ్యే మిథిలా మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
Sri Rama Navami: కల్యాణానికి ముందురోజైన శనివారం (ఏప్రిల్ 5న) అంగరంగ వైభవంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయి. స్వామి, అమ్మవారల ఎదుర్కోలు కార్యక్రమాన్ని భక్తజనుల నడుమ వేద పండితులు సందడిగా నిర్వహించనున్నారు. కల్యాణం జరిగిన మరుసటి రోజున (ఏప్రిల్ 7) శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవం వేడుకగా జరగనున్నది.
Sri Rama Navami: సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా హాజరవుతారు. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సంప్రదాయ సిద్ధంగా అందజేయనున్నారు. అదే విధంగా ఆలయ మాఢ వీధుల విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. గిరిజన మూజియం ప్రారంభోత్సవంతోపాటు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటిలో అక్కడే సీఎం రేవంత్‌రెడ్డి భోజనం చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Sri Rama Navami: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ పట్టువస్త్రాలను సమర్పించి, మొక్కులు చెల్లించనున్నారు. అదే విధంగా స్వామివారికి కల్యాణ మహోత్సవానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క హాజరు కానున్నారు.
Sri Rama Navami: భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, సుప్రీంకోర్టు జడ్జీలు, పలువురు ప్రజాప్రతినిధులు, వీవీఐపీలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు భారీగా భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రొటోకాల్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ మేరకు శ్రీరామనవమి వేడుకల కోసం 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.