SP Balasubrahmanyam

SP Balasubrahmanyam: తెలంగాణలో ఆంధ్రుల విగ్రహం పెట్టకూడదు.. ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై తీవ్ర వివాదం

SP Balasubrahmanyam: హైదరాబాద్‌లోని ప్రముఖ సాంస్కృతిక వేదిక రవీంద్రభారతి ప్రాంగణం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు, భావోద్వేగ చర్చకు కేంద్రంగా మారింది. దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) విగ్రహ ఏర్పాటుకు ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తుండగా, తెలంగాణవాదుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. కళకు ప్రాంతీయ హద్దులు లేవని ఒక వర్గం వాదిస్తుంటే, ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బతీయడమేనని మరో వర్గం గట్టిగా నిలదీస్తోంది.

వివాదం ఎందుకు మొదలైంది?

ఈ నెల 15న ఎస్పీబీ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కుటుంబ సభ్యులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా పేరుగాంచిన రవీంద్రభారతిలో కేవలం తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలే ఉండాలని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వాదిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్పీ బాలు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ గడ్డపై ప్రజాకవి గద్దర్, ప్రముఖ కవి అందెశ్రీ వంటి మహానుభావులకు దక్కాల్సిన గౌరవం ముందు దక్కాలి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేం అంగీకరించబోం అని పృథ్వీరాజ్ తన అనుచరులతో కలిసి విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

వాగ్వాదం… ఉద్రిక్తత!

పృథ్వీరాజ్ ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్పీ బాలు కుటుంబ సభ్యుడు, సినీ నటులు శుభలేఖ సుధాకర్ హుటాహుటిన రవీంద్రభారతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్, సుధాకర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠాపనపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది.

ఇది కూడా చదవండి: Natural Star Nani: నాని నుంచి మరో భారీ సర్ప్రైజ్?

శుభలేఖ సుధాకర్ వాదన:

కళాకారులను ప్రాంతాల వారీగా చూడటం సరికాదు. సంగీతానికి, కళకు రాష్ట్రాలు, సరిహద్దులు ఉండవు. సంగీతం విశ్వజనీనం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, ఆయన తన గానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన విశ్వ విఖ్యాత గాయకుడు. ఆయన సేవలను గౌరవించాల్సింది పోయి, ప్రాంతీయతను ఆపాదించడం కళను అవమానించడమే. అయినప్పటికీ, పృథ్వీరాజ్ తన పట్టు వీడలేదు. ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదంతో రవీంద్రభారతి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సోషల్ మీడియాలో చర్చ

ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.”గొప్ప కళాకారుల విషయంలో కూడా ప్రాంతీయ బేధాలా?” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.”ఎస్పీ బాలు భారతీయ సంగీతానికి చేసిన సేవలు అపారం. అటువంటి వ్యక్తి విగ్రహం ప్రతిష్ఠిస్తే కూడా ఇన్ని అడ్డంకులా?” అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ కళాకారులను గౌరవించాలని డిమాండ్ చేయటంలో తప్పు లేదని, అయితే ఎస్పీ బాలు విగ్రహాన్ని అడ్డుకోవటం సరైంది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, శుభలేఖ సుధాకర్ కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎస్పీ బాలు విగ్రహ ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది. విగ్రహావిష్కరణ ఏర్పాట్లు కొనసాగుతుండగా, పృథ్వీరాజ్ ఆందోళన నేపథ్యంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రవీంద్ర భారతిలో నెలకొన్న ఈ ఉద్రిక్తత, కళాకారుల గౌరవం విషయంలో ప్రాంతీయ అంశాలు ఎంతమేర ప్రభావం చూపుతాయో తేల్చే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *