Prakash Raj: దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ బాలీవుడ్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ హిందీ సినిమాలు ప్రస్తుతం ఆత్మ లేని ప్లాస్టిక్ విగ్రహాల మాదిరిగా మారాయని అన్నారు. గ్లామర్, లగ్జరీకి పరిమితమైన బాలీవుడ్ సామాన్య ప్రేక్షకుల నుంచి దూరమవుతోందని విశ్లేషించారు. అయితే దక్షిణాది సినిమాలను మాత్రం పొగిడారు.
Also Read: Trivikram Srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా సిరివెన్నెల విగ్రహ ఆవిష్కరణ
నాలుగు దశాబ్దాలుగా అన్ని భాషల్లో విలక్షణ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ సమాజ విషయాలపై ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడతారు. కోజికోడ్‌లో జరిగిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శించారు. పైకి అద్భుతంగా, కలర్‌ఫుల్‌గా బాలీవుడ్ కనిపించినా లోపల ఆత్మ లేని డొల్ల సినిమాలుగా మారాయని, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని ప్లాస్టిక్ విగ్రహాల్లా ఉన్నాయని అన్నారు. బాలీవుడ్ సినిమాలు మల్టీప్లెక్స్ సంస్కృతి, భారీ ప్రమోషన్లు, లగ్జరీ లుక్స్‌తో డబ్బు చుట్టూ తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో తమిళ, మలయాళ దర్శకులు మట్టి కథలు, దళిత వేదనలు, సామాజిక సమస్యలను సహజంగా చూపిస్తున్నారని కొనియాడారు. ‘జై భీమ్’, ‘మామన్నన్’ వంటి చిత్రాలు మార్పు కోసం ప్రయత్నిస్తుంటే బాలీవుడ్ కేవలం కమర్షియల్ హంగులకే పరిమితమైందని విమర్శించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
