Smart Family Card: సుపరిపాలన (Good Governance) లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం పెంచేందుకు వీలుగా ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించే ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం (FBMS)’ను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాల వివరాలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు.
ఈ మేరకు సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలు, పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని, కుటుంబ సాధికారితే దీని ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
స్మార్ట్ ఫ్యామిలీ కార్డు: ఒకే కార్డు – అన్ని సేవలు
FBMS వ్యవస్థలో భాగంగా ప్రతి కుటుంబానికి QR కోడ్‌తో కూడిన ‘స్మార్ట్ ఫ్యామిలీ కార్డు’ను జారీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్డును ‘వన్ సొల్యూషన్ ఫర్ ఆల్’ గా రూపొందించనున్నారు.
ఈ స్మార్ట్ కార్డులో కుటుంబానికి చెందిన 25 రకాల వివరాలు, ఆధార్ సమాచారం మరియు FBMS ఐడీ సహా ముఖ్యమైన అంశాలను పొందుపరుస్తారు.
కేవలం రేషన్, పెన్షన్ల వంటి పథకాలకే పరిమితం కాకుండా… కుల ధృవీకరణ, స్కాలర్‌షిప్‌లు, పౌష్టికాహారం, వాక్సినేషన్ వంటి పౌరులకు సంబంధించిన అన్ని రకాల ప్రభుత్వ సేవలు, పథకాల వివరాలనూ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ చేసేలా వ్యవస్థను రూపొందించనున్నారు. అర్హులైన వారందరికీ సులభంగా, వేగంగా పౌర సేవలు అందించేందుకు ఈ స్మార్ట్ కార్డు ఒక శక్తివంతమైన సాధనంగా మారాలి.
ఇది కూడా చదవండి: Pradeep Ranganathan: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. మరో 100కోట్ల సినిమా అవుతుందా..?
రియల్ టైమ్ గవర్నెన్స్: డేటా ఆధారిత పాలన
ఈ సమగ్ర సమాచార నిర్వహణ వ్యవస్థ (FBMS) అమలు కోసం రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని, డేటా లేక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సీఎం సూచించారు.
RTGS వద్ద ఉన్న ప్రామాణిక సమాచారాన్ని ఇతర ప్రభుత్వ శాఖలన్నీ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఈ వ్యవస్థలో స్టాటిక్ డేటా (స్థిర సమాచారం)తో పాటు, డైనమిక్ డేటా (నిరంతరం మారుతున్న సమాచారం) వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా ఈ అప్‌డేట్ ప్రక్రియ జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఈ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఎంపికలో ఎదురయ్యే సవాళ్లకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, సుపరిపాలన లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ముందుగా, 2026 జనవరి నాటికి కుటుంబాల పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి సిద్ధం చేయాలి. ఆ తర్వాత, 2026 జూన్ నాటికి రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు గట్టిగా సూచించారు.
