Adulterated Ghee

Adulterated Ghee: పామాయిల్, కెమికల్స్‌తోనే తిరుమల నెయ్యి తయారీ!

Adulterated Ghee: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక విచారణ బృందం (SIT) సంచలన విషయాలను బయటపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో (2019-2024) జరిగిన ఈ వ్యవహారంపై సిట్ అధికారులు ఇటీవల నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. ఈ నివేదిక ప్రకారం, కోట్ల మంది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తూ నిబంధనలకు విరుద్ధంగా కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) సరఫరా చేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది.

నిబంధనల సడలింపు – కల్తీకి మార్గం..

2019 కంటే ముందు నెయ్యి సరఫరా చేసే డెయిరీలకు కఠినమైన నిబంధనలు ఉండేవి. అయితే, గత పాలకమండలి మరియు ఉన్నతాధికారులు కలిసి ఈ నిబంధనలను భారీగా సడలించారు. డెయిరీలకు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, టర్నోవర్ పరిమితిని రూ. 250 కోట్ల నుంచి రూ. 150 కోట్లకు తగ్గించేశారు. ఈ సడలింపులను ఆసరాగా చేసుకుని అనర్హత కలిగిన సంస్థలు టెండర్లలోకి చొరబడ్డాయి. ముఖ్యంగా భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ అనే సంస్థ సుమారు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తయారు చేసి, అందులో మెజారిటీ భాగాన్ని టీటీడీకు సరఫరా చేసింది. దీనివల్ల రూ. 234.51 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది.

ఇది కూడా చదవండి: Danam Nagender: నాపై ఉన్న అనర్హత పిటిషన్‌ను కొట్టివేయండి.. స్పీకర్‌కు దానం నాగేందర్ విజ్ఞప్తి

ఏం కలిపారు? ల్యాబ్ నివేదికలు ఏం చెబుతున్నాయి?

నిందితులు పామాయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్ వంటి చౌకైన నూనెలను తక్కువ పరిమాణంలో నెయ్యితో కలిపారు. ఈ మిశ్రమానికి లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను జోడించారు. ల్యాబ్ పరీక్షల్లో పట్టుబడకుండా ఉండటానికి మరియు నెయ్యి వాసన వచ్చేలా చేయడానికి ఈ రసాయనాలను వాడినట్లు సిట్ నిర్ధారించింది. గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (NDDB) ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ నమూనాల్లో ఆవు నెయ్యి పరిమాణం చాలా తక్కువగా ఉందని, కేవలం వనస్పతి వంటి కొవ్వులే అధికంగా ఉన్నాయని తేలింది.

అధికారుల కుమ్మక్కు మరియు లంచాలు..

ఈ భారీ కుంభకోణంలో టీటీడీ అధికారుల పాత్ర కీలకంగా ఉన్నట్లు సిట్ పేర్కొంది. నాటి టీటీడీ ఛైర్మన్ పీఏగా ఉన్న చిన్నప్పన్న కిలో నెయ్యికి రూ. 25 చొప్పున లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక సంస్థ నుంచి ఏకంగా రూ. 50 లక్షలు లంచం తీసుకుని అధిక ధరలకు ఆర్డర్లు కట్టబెట్టారు. నెయ్యి కల్తీ అని ల్యాబ్ రిపోర్టుల్లో తేలినా, కొందరు అధికారులు ఆ నివేదికలను దాచిపెట్టి కల్తీ నెయ్యి సరఫరాను కొనసాగించనిచ్చారు. తనిఖీలకు వెళ్లిన బృందాలు కూడా ప్లాంట్ల వద్ద ఉన్న లోపాలను పట్టించుకోకుండా అనుకూలంగా నివేదికలు ఇచ్చి భక్తుల మనోభావాలతో ఆడుకున్నట్లు అభియోగపత్రంలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *