KCR: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ప్రత్యేక విచారణ బృందం (SIT) సిద్ధమైంది. ఈ ప్రక్రియ కోసం సిట్ అధికారులు ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో ఉన్న ఆయన నివాసానికి బయల్దేరి వెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
గత కొద్ది రోజులుగా ఈ కేసు విచారణ అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును సిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తోంది.
అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది? అనే విషయాలను బయటపెట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ నివాసానికి అధికారులు వెళ్లడంతో ఈ కేసు ఎటువైపు దారితీస్తుందోనని అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
