KCR

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు మధ్యాహ్నం విచారణ!

KCR: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్‌ఎస్ ముఖ్య నేతలకు నోటీసులు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తాజాగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.

నందినగర్ నివాసంలో నోటీసులు..

కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఉండటంతో, అధికారులు అక్కడికే వెళ్తారని అందరూ భావించారు. కానీ, సిట్ అధికారులు గురువారం ఉదయం బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు అందజేశారు.

ఇది కూడా చదవండి: Uttar Pradesh: క్రైమ్ థ్రిల్లర్‌ను మించిన ఘోరం.. ప్రియురాలిని చంపి ముక్కలు చేసిన కిరాతకుడు!

విచారణ ఎప్పుడు? ఎక్కడ?

ఈ నోటీసుల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని అధికారులు కోరారు. అయితే, కేసీఆర్ వయసును పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు ఆయనకు ఒక వెసులుబాటు కల్పించారు. విచారణ కోసం ఆయన ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్‌కు లేదా సిట్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ కోరుకున్న చోటే (ఆయన నివాసంలోనే) సిట్ అధికారులు వచ్చి విచారిస్తామని స్పష్టం చేశారు.

నేతల వరుస విచారణ..

 ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వంటి కీలక నేతలను సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రేపు మధ్యాహ్నం జరగబోయే ఈ విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *