Singer Chinmayi: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ మరియు ఆన్లైన్ వేధింపులకు గురయ్యారు. కొందరు వ్యక్తులు ఎక్స్ (ట్విటర్) స్పేస్‌లలో ఆమెను, ఆమె కుటుంబాన్ని అభంశుభం తెలియని ఆమె పిల్లలను టార్గెట్ చేస్తూ అత్యంత అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలు వివాదం ఏమిటి?
ఈ తాజా వివాదానికి బీజం, చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ప్రమోషన్స్ కోసం నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పడింది. ఆ ఇంటర్వ్యూలో రాహుల్ రవీంద్రన్ మంగళసూత్రం గురించి మాట్లాడుతూ, “తాళి వేసుకోవడం లేదా అనేది పూర్తిగా నా భార్య (చిన్మయి) ఛాయిస్ ఆ ఫ్రీడమ్ నేను నా భార్యకు ఇచ్చాను,” అని వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సాంప్రదాయవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. వెంటనే నెటిజన్లు చిన్మయిపై, ఆమె కుటుంబంపై ట్రోలింగ్‌కు దిగారు.
ఎక్స్ స్పేస్‌లో దారుణ దూషణ
ఈ ట్రోలింగ్ తీవ్ర స్థాయికి చేరి, కొందరు యువకులు ‘మెన్ ఫెమినిస్ట్’ పేరుతో గ్రూప్ వాయిస్ కాల్స్ (ఎక్స్ స్పేస్‌లు) నిర్వహించారు.ఈ లైవ్ కాల్స్‌లో చిన్మయిని టార్గెట్ చేస్తూ, “వీరికి పిల్లలు పుట్టకూడదు, ఒకవేళ పుట్టినా చనిపోవాలని… వీళ్లకు పిల్లలు కనే రైట్ లేదు” అంటూ అభంశుభం తెలియని చిన్నారులను కూడా లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు.
ఇది కూడా చదవండి: Chikiri Chikiri Song: రామ్ చరణ్ మాస్ స్టెప్పులు వేరేలెవల్.. పెద్ది నుంచి ఫస్ట్ వీడియో సాంగ్ రిలీజ్..!
నిత్యం అవమానాలతో విసిగిపోయామని, మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన చిన్మయి, ఈ సంభాషణను హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు ఎక్స్‌లో ట్యాగ్ చేశారు. “ఇలాంటి వారి వల్ల సమాజంలో మహిళలకు భద్రత కరువైందని, అభంశుభం తెలియని పిల్లలు చనిపోవాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని” ఆమె ప్రశ్నించారు.
సైబర్ క్రైమ్ కేసు నమోదు
చిన్మయి ట్వీట్‌కు రెస్పాండైన సీపీ సజ్జనార్, వెంటనే చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. గురువారం చిన్మయి నేరుగా బషీర్ బాగ్‌లోని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఏసీపీ శివమారుతి తెలిపారు. “కేసు 15 ఏళ్లు నడిచినా ఫర్వాలేదు, తాను పోరాడుతానని” చిన్మయి స్పష్టం చేశారు.
ట్రోలర్లు తమ అకౌంట్లను ఇప్పటికే డీ-యాక్టివేట్ చేసుకున్నప్పటికీ, ఎవరు ట్రోల్ చేశారనే విషయాన్ని తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు వారి అకౌంట్స్ వివరాలపై ఆరా తీస్తున్నారు.
