Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం నమోదైంది. అత్యంత ఉత్కంఠగా సాగిన కైమూర్ జిల్లాలోని రామ్‌గఢ్ అసెంబ్లీ స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థి విజయం సాధించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీకి చెందిన అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్ల స్వల్ప తేడాతో తన సమీప ప్రత్యర్థిని ఓడించారు. బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ యాదవ్‌కు 72,689 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌కు 72,659 ఓట్లు లభించాయి. ఓట్ల లెక్కింపు చివరి వరకు ఇరు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నడిచింది. స్వల్ప తేడాతో గెలుపొందడం బీహార్‌లో బీఎస్పీకి పెద్ద విజయాన్ని ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ గెలిచిన ఏకైక స్థానం ఇదే కావడం గమనార్హం. ఈ ఫలితం రామ్‌గఢ్ స్థానంలో విజయం కోసం జరిగిన హోరాహోరీ పోరును, ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఒక్క ఓటు విలువను మరోసారి చాటి చెప్పింది.

