Kolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా (Kolkata) నగరంలో శనివారం తెల్లవారుజామున పెను ప్రమాదం జరిగింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన బరాబజార్ పరిధిలో ఉన్న ఎజ్రా స్ట్రీట్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో 17 ఎజ్రా స్ట్రీట్‌లోని ఒక ఎలక్ట్రికల్ వస్తువుల దుకాణం రెండవ అంతస్తులో మొదలైన మంటలు అతి వేగంగా పక్కకు వ్యాపించాయి. మంటలు, దట్టమైన పొగ కారణంగా ఆ ప్రాంతమంతా భయాందోళన వాతావరణం నెలకొంది. పొద్దార్ కోర్టుకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో మంటల ధాటికి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
దుకాణం లోపల భారీ పరిమాణంలో విద్యుత్ వస్తువులు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ వస్తువులు ఒకదాని తర్వాత ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోవడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు 17 అగ్నిమాపక యంత్రాలు (ఫైర్ ఇంజిన్లు) ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Also Read: Jammu Kashmir: శ్రీనగర్ నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. 9 మృతి
ఈ ప్రాంతంలో చుట్టుపక్కల దుకాణాలన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించినవే కావడంతో, మంటలు పక్కనే ఉన్న భవనాలకు వ్యాపించకుండా ఆపడం సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. అలాగే, పేలుతున్న సిలిండర్లు మంటల తీవ్రతను మరింత పెంచాయి. అగ్నిమాపక సిబ్బంది వీధికి రెండు వైపుల నుండి నీటిని చల్లుతూ, మంటలను నియంత్రించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరిగిందా లేదా అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతే నష్టం అంచనా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
