Sivaji: మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు.. రంగంలోకి మహిళా కమిషన్

Sivaji: హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో మహిళల దుస్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు శివాజీ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ అంశంపై శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ చేసింది.

సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ, మహిళల వస్త్రధారణపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చీర కట్టుకుంటేనే అందమని, ఇతర దుస్తులు ధరించే మహిళలపై అవమానకరంగా మాట్లాడటం తీవ్ర దుమారానికి కారణమైంది. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను కమిషన్ లీగల్ టీమ్ పరిశీలిస్తోందని, మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. సినిమా వేడుకలు, బహిరంగ వేదికల్లో మాట్లాడే ప్రముఖులు బాధ్యతతో వ్యవహరించాలని ఆమె సూచించారు.

శివాజీ వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాదతో పాటు పలువురు సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. మహిళల దుస్తుల ఎంపికపై వ్యాఖ్యలు చేయడం వారి వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమేనని, ఇలాంటి మాటలు సమాజాన్ని వెనక్కి నెట్టే ఆలోచనలను ప్రతిబింబిస్తాయని విమర్శించారు.

ఈ వివాదం ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. మహిళా కమిషన్ నోటీసుల నేపథ్యంలో శివాజీ ఈ అంశంపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *