Shambala: టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ చాలా కాలం తర్వాత ‘శంబాల’ చిత్రంతో ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ మిస్టరీ థ్రిల్లర్, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. జనవరి 21, 2026న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలైన ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న బడ్జెట్ సినిమాల పరంగా ఇది ఒక అరుదైన రికార్డుగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఈ సినిమా కథా నేపథ్యం విషయానికి వస్తే, 1980వ దశకంలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ‘శంబాల’ అనే గ్రామంలో జరిగిన వింత సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఆకాశం నుండి ఒక ఉల్క పడిన తర్వాత ఆ ఊరి ప్రజలు విచిత్రంగా ప్రవర్తిస్తూ హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. దీనిని బండ భూతం ప్రభావంగా భావించి గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్న తరుణంలో, ఆ రహస్యాలను ఛేదించడానికి విక్రమ్ అనే యువ శాస్త్రవేత్తగా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతారు. మూఢనమ్మకాలకు, సైన్స్‌కు మధ్య జరిగిన ఈ పోరాటాన్ని దర్శకుడు యుగంధర్ ముని అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు.
Also Read: Priyamani : తగ్గని ప్రియమణి క్రేజ్… తెలుగులో భారీ రెమ్యునరేషన్!
మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రంలో ఆది నటనతో పాటు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. థియేటర్ల వద్ద సుమారు రూ. 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో ‘కింగ్’లా దూసుకుపోతోంది. ఈ భారీ స్పందనతో ‘శంబాల’ హిందీ వెర్షన్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. త్వరలోనే హిందీ ప్రేక్షకులకు కూడా ఈ మిస్టరీ థ్రిల్లర్ అందుబాటులోకి రానుంది. తెలుగులో లభించిన అద్భుతమైన ఆదరణతో చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
