Weather Alert

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మొదలైన చలి పంజా.. ఈ వారం ఉష్ణోగ్రతలు ఫట్!

Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్య గమనికను జారీ చేసింది. గత కొద్ది రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన చలి తీవ్రత మళ్లీ పుంజుకోనుంది. సోమవారం నుంచి సుమారు వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే ఛాన్స్ ఉండటంతో జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

తెలంగాణలో చలి గాలుల ముప్పు: తెలంగాణలో రానున్న వారం రోజులు రాత్రి వేళల్లో చలి విపరీతంగా ఉండబోతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ‘కోల్డ్‌ వేవ్’ పరిస్థితులు ఏర్పడవచ్చు. పగటిపూట ఎండ ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు 25-26 డిగ్రీలకే పరిమితం అవుతాయి. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా: ఏపీలో కూడా చలి తన ప్రభావాన్ని చూపబోతోంది. అమరావతి వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో ఈశాన్య మరియు తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమ మరియు యానాం ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉంది. అయితే, తెలంగాణతో పోలిస్తే ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు ఉండకపోవచ్చు కానీ చలి గాలి ప్రభావం మాత్రం కనిపిస్తుంది.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు మరియు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు పొగమంచు కారణంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని అధికారులు కోరుతున్నారు. ఈ వారమంతా ఆకాశం నిర్మలంగా ఉండి పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *