Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న తాను పార్టీకి చెందినవాడో కాదో నిర్ణయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం తాము ఎంతో కష్టపడ్డామని గుర్తుచేశారు. పార్టీ సభ్యుడిగా ఉంటే, పార్టీ లైన్‌కి అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు.
మల్లన్నకు ఏదైనా అనుమానాలు ఉంటే, పార్టీ సమావేశాలకు హాజరై నేరుగా ప్రశ్నించవచ్చని సీతక్క సూచించారు. పార్టీ వ్యవస్థను పక్కన పెట్టి విమర్శించడం సరికాదని చెప్పారు.
కుల గణన నివేదిక కాల్చివేతపై ఆగ్రహం
తీన్మార్ మల్లన్న కుల గణన నివేదికను కాల్చివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీసీలకు న్యాయం చేసే ఆలోచనే ప్రభుత్వానికి లేదని ఆయన ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. కుల గణన నివేదికకు నిప్పు పెట్టడం దారుణం అన్నారు.
కుల గణనలో తప్పులు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా మంత్రి స్పందించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు సర్వేలో పాల్గొనలేదని, అటువంటి వారికీ విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో దేశంలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని, ఇది దేశానికి దిక్సూచి అవుతుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.