Satya Kumar: లిక్కర్ స్కాంలో ఎవరున్నా వదలం

Satya Kumar: లిక్కర్‌ స్కాం కేసులో ఎవరికీ మినహాయింపు లేదని రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ హెచ్చరించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ మరియు రిమాండ్‌పై స్పందించారు. ఈ కేసును సిట్‌ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోందని, ఇందులో ఎంతమంది వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయో త్వరలో వెలుగులోకి వస్తుందని తెలిపారు.

లిక్కర్‌ స్కాం మాత్రమే కాదు, గత ఐదేళ్లలో జరిగిన భూ కుంభకోణాలు, ఇతర అవినీతి వ్యవహారాలపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బనకచర్ల వివాదంపై స్పందించిన మంత్రి.. మిగులు జలాల విషయంలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకెళ్తోందని చెప్పారు. ఎవరూ భావోద్వేగాలతో కాకుండా, రైతుల హక్కులకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించామన్నారు.

ఇదే సందర్భంగా ప్రభుత్వ వైద్యులు సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు. లేదంటే వారి మీద మెమోలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేగాక, విదేశాల్లో వైద్య, విద్యను అభ్యసించిన వారికి న్యాయం చేయడానికి ఎన్ఎంసీ మార్గదర్శకాలు, న్యాయస్థానాల తీర్పుల ప్రకారం ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సత్యకుమార్‌ స్పష్టం చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *