Sabarimala Temple

Sabarimala Temple: పవిత్ర పంబా నదిలో బట్టలు వదిలేయొద్దు.. అది ఏ శాస్త్రంలోనూ లేదు!

Sabarimala Temple: కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా “స్వామియే శరణం అయ్యప్ప” అనే శరణు ఘోషే వినిపిస్తుంది. 41 రోజుల పాటు ఎంతో నిష్ఠతో, కఠిన నియమాలతో మాల ధరించిన భక్తులు, తమ యాత్రలో భాగంగా ముందుగా కేరళలోని పవిత్ర పంబా నదిలో స్నానం చేసి, ఆ తర్వాత ఇరుముడితో కొండెక్కుతారు. అయితే, ఇక్కడే ఒక చిన్న అపోహ వల్ల పవిత్రమైన పంబా నదికి, పర్యావరణానికి పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్యను పరిష్కరించడానికి కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) ఇప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖలు రాశాయి.

పంబా నదిలో బట్టలు వదిలేయడం ఏ శాస్త్రంలోనూ లేదు!

వార్షిక మండల-మకరవిళక్కు యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో, లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
  • గురుస్వాముల మాటలతో అపోహ: పంబా నదిలో స్నానం చేశాక, అప్పటివరకు తాము వేసుకున్న నల్ల బట్టలు, ఇతర వస్త్రాలను నదిలోనే వదిలేస్తే పాపాలు పోతాయని కొందరు గురుస్వాములు చెప్పే మాటలు విని భక్తులు అలా చేస్తున్నారు. కానీ, “పంబా నదిలో బట్టలు వదిలేయాలనే నిబంధన ఏ శాస్త్రంలోనూ, అయ్యప్ప పూజా విధానంలోనూ లేదు” అని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది.

  • వందల ట్రక్కుల కొద్దీ బట్టల గుట్టలు: భక్తులు ఇలా బట్టలు వదిలేయడం వల్ల పంబా నదిలో అవి వందల ట్రక్కుల కొద్దీ పేరుకుపోతున్నాయి. వాటిని నదిలోంచి తీయడం పారిశుద్ధ్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.

పవిత్రమైన నది కలుషితమైతే అది మనకే ప్రమాదం!

మనం ఎంతో భక్తితో, పుణ్యం వస్తుందని ఆ నదిలో స్నానం చేస్తాం. కానీ, అలా వదిలేసిన బట్టల వల్ల నీటి ప్రవాహం ఆగిపోయి, నదిలో వైరస్‌లు, బ్యాక్టీరియా వ్యాపించి నీరు తీవ్రంగా కలుషితమవుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరుసటి రోజు వచ్చే భక్తులు మళ్లీ అదే నీటిలో స్నానం చేయాల్సి వస్తుంది కాబట్టి, అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అలవాటును మానుకోవాలని కోరుతున్నారు.

‘క్లీన్ శబరిమల, పవిత్ర శబరిమల’ – తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ

ఈ ఏడాది శబరిమల యాత్రను ‘క్లీన్ శబరిమల, పవిత్ర శబరిమల’ అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శబరిమలకు వచ్చే భక్తుల్లో అత్యధిక శాతం మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే ఉంటారు. అందుకే ఈ విషయంపై మన తెలుగు రాష్ట్రాల్లోని గురుస్వాములు, అయ్యప్ప భక్తులకు టీవీలు, పేపర్లు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని కోరుతూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు (CS) కేరళ అధికారులు లేఖలు రాశారు.
భక్తి అంటే ప్రకృతిని ప్రేమించడం, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడం కూడా! కాబట్టి, ఈసారి శబరిమల యాత్రకు వెళ్లే స్వాములు పంబా నది పవిత్రతను కాపాడుతూ, బట్టలను నదిలో వదలకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బోర్డు విజ్ఞప్తి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *