Russia: అమెరికా సుంకాల మోత మోగిస్తున్న సమయంలో భారత్‌కు మిత్రదేశం రష్యా నుంచి ఊరట కలిగించే నిర్ణయం వచ్చింది. రష్యా, భారత్‌కు సరఫరా చేసే ముడి చమురుపై ఐదు శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని రష్యా డిప్యూటీ ట్రేడ్ ప్రతినిధి ఎవ్‌జెనీ గ్రివా స్వయంగా వెల్లడించారు.
అమెరికా ఆంక్షలు – భారత్‌పై ఒత్తిడి
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపాలని అమెరికా మిత్రదేశాలపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తోంది. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను 50 శాతం వరకు పెంచి, నేరుగా ఆర్థిక ఒత్తిడి సృష్టించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల, భారత్ ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆరోపణలు చేశారు. కానీ ఇదే సమయంలో చైనా భారీగా రష్యా చమురు దిగుమతి చేస్తున్నా, అమెరికా ఏమీ చేయలేకపోవడం గమనార్హం.
ఇది కూడా చదవండి: KTR: కేసీఆర్ పాలనలో రాని రైతుల కష్ఠాలు.. ఇపుడెందుకు వస్తున్నాయి..?
రష్యా ధీమా – భారత్‌కు భరోసా
“రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా, భారత్-రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందనే నమ్మకం మాకు ఉంది. డిస్కౌంట్ శాతం వాణిజ్య చర్చలపై ఆధారపడి, 5 శాతం కంటే ఎక్కువగానీ తక్కువగానీ ఉండొచ్చు” అని రష్యా ప్రతినిధి గ్రివా తెలిపారు. రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఇరుదేశాల సంబంధాలు బలంగా కొనసాగుతాయని అన్నారు.
భారత్ ప్రతిస్పందన
అమెరికా విధించిన పెనాల్టీ సుంకాలను భారత్ తీవ్రంగా ఖండించింది. వస్త్రాలు, తోలు, సముద్ర ఉత్పత్తులపై నేరుగా ప్రభావం పడినా, ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు – “భారత్ తన ఆర్థిక, ఇంధన ప్రయోజనాల విషయంలో వెనక్కు తగ్గదు” అని.
విశ్లేషణ
ఇక పరిస్థితి చూస్తే – అమెరికా రష్యాను ఆర్థికంగా ఒంటరిచేయాలని ప్రయత్నిస్తుంటే, రష్యా మాత్రం భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి తగ్గింపులు, సౌకర్యాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిడులు ఉన్నా భారత్ తన ఎనర్జీ భద్రత కోసం రష్యా చమురు దిగుమతిని కొనసాగించడమే కాకుండా, ఇప్పుడు మరింత తక్కువ ధరకు పొందబోతోంది.

