Trump Zelenskyy Meeting

Trump Zelenskyy Meeting: ట్రంప్–జెలెన్‌స్కీ భేటీకి ముందు కీవ్‌పై రష్యా భారీ దాడి

Trump Zelenskyy Meeting: అమెరికాలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ, ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఫ్లోరిడాలో డొనాల్డ్ ట్రంప్‌, వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య జరగనున్న కీలక శాంతి చర్చలు  రేపు జరగనుండగా రష్యా ఉక్రెయిన్‌పై మరోసారి భారీ దాడికి తెగబడింది. శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో సమన్వయ దాడి నిర్వహించింది.

కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణులు, ఇస్కందర్ బాలిస్టిక్ మిస్సైళ్లు, కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్లతో జరిగిన ఈ దాడులతో కీవ్ నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని శివారు ప్రాంతమైన బ్రోవరీతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగడంతో ప్రజలు భయంతో అండర్‌గ్రౌండ్ షెల్టర్లకు పరుగులు తీశారు. కీవ్ మేయర్ విటాలీ క్లిచ్‌కో ఈ దాడులను ధ్రువీకరిస్తూ, రాజధానిలో పేలుళ్లు సంభవించాయని తెలిపారు. వాయు రక్షణ దళాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొంటూ, ప్రజలంతా సురక్షితంగా షెల్టర్లలోనే ఉండాలని ఆయన టెలిగ్రామ్ ద్వారా సూచించారు. దాడుల వల్ల జరిగిన నష్టంపై అధికారులు ప్రస్తుతం అంచనాలు వేస్తున్నారు.

ఇదిలా ఉండగా, అమెరికాలోని ఫ్లోరిడాలో డిసెంబర్ 28న ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకాలనే లక్ష్యంతో అమెరికా చొరవతో ఈ చర్చలు సాగనున్నాయి. ఈ భేటీలో 20 సూత్రాల శాంతి ప్రణాళిక, ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు, ఆర్థిక ఒప్పందాలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశానికి ముందు ఉక్రెయిన్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకే రష్యా దాడులను తీవ్రతరం చేసిందని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు.

Also Read: CWC Meeting: ఢిల్లీలో నేడు సీడబ్ల్యూసీ సమావేశం..!

ఈ భేటీపై జెలెన్‌స్కీ ఇప్పటికే స్పందిస్తూ, సమీప భవిష్యత్తులో ట్రంప్‌తో ఉన్నతస్థాయి సమావేశానికి అంగీకరించామని, ఒక్క రోజును కూడా వృథా చేయడం లేదని తెలిపారు. 20 సూత్రాల శాంతి ప్రణాళిక దాదాపు 90 శాతం సిద్ధమైందని, ఉక్రెయిన్ భద్రతా హామీలే ఈ సమావేశంలో ప్రధాన అంశమని స్పష్టం చేశారు. ఈ చర్చల్లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు కూడా భాగస్వాములవ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే తక్కువ సమయంలో అది సాధ్యమా కాదా అన్నదానిపై స్పష్టత లేదన్నారు.

మరోవైపు ట్రంప్‌ ఈ శాంతి ప్రణాళికపై తనదైన శైలిలో స్పందించారు. తాను ఆమోదించే వరకు జెలెన్‌స్కీ వద్ద ఏమీ లేదని వ్యాఖ్యానిస్తూ, ఆయన ఏమి ప్రతిపాదిస్తారో చూడాలని అన్నారు. ఇదే సమయంలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్‌, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌లతో జరిగిన చర్చలు సానుకూలంగా ఉన్నాయని జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ భేటీల అనంతరం ఎక్స్ వేదికగా మాట్లాడిన ఆయన, ఉక్రెయిన్ భద్రత, పునర్నిర్మాణం, శాశ్వత శాంతి వంటి అంశాలపై కీలకంగా చర్చించినట్లు తెలిపారు.

శీతాకాలాన్ని ఆయుధంగా మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్ ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెంచుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ దాడులు జరిగినప్పటికీ జెలెన్‌స్కీ ఫ్లోరిడా పర్యటన యథాతథంగా కొనసాగుతుందని సమాచారం. యుద్ధానికి ముగింపు దిశగా కీలక చర్చలు సాగుతున్న వేళ, ట్రంప్–జెలెన్‌స్కీ భేటీపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *