Sai Krishna Case

Sai Krishna Case: కృష్ణలంక క్రైమ్ కానిస్టేబుల్ అరెస్ట్!.. నేడు హైకోర్టులో కీలక విచారణ!

Sai Krishna Case: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) చర్యలు వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) నాగరాజును అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. తాజాగా మరో పోలీసు సిబ్బందిని కటకటాల్లోకి నెట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును అధికారులు అధికారికంగా అరెస్ట్ చేశారు.

సాయికృష్ణ మరణానికి సంబంధించిన వివరాలపై కానిస్టేబుల్ బాబురావును సిట్ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ విచారణలో లాకప్ డెత్‌కు దారితీసిన పరిస్థితుల్లో సదరు కానిస్టేబుల్ పాత్ర కూడా ఉన్నట్లు పక్కా ఆధారాలు లభించడంతో ఈ అరెస్ట్ నిర్ణయం తీసుకున్నారు. నిందితుడైన కానిస్టేబుల్‌ను ఈరోజే న్యాయస్థానం ముందు హాజరుపరచనున్న సిట్.. కేసులోని మరిన్ని నిజాలను రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది.

నేడు హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్‌పై విచారణ

మరోవైపు, ఈ వ్యవహారంలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన మిస్సింగ్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. తన కుమారుడు కనిపించడం లేదంటూ ఆమె గతంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. సాయికృష్ణను వెంటనే తమ ముందు హాజరుపరచాలని గత విచారణలోనే పోలీసులను ఆదేశించింది.

కాగా, సాయికృష్ణ అదృశ్యంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా.. వారి ప్రాథమిక దర్యాప్తులోనే అసలు నిజాలు వెలుగుచూశాయి. పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా కొట్టడం వల్లే సాయికృష్ణ పోలీస్ కస్టడీలోనే మరణించాడని, ఆ తర్వాత దానిని మిస్సింగ్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని సిట్ నిర్ధారించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును అరెస్ట్ చేయడంతో.. మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం కాస్తా సంచలన లాకప్ డెత్ కేసుగా రూపాంతరం చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *