Rohit Sharma: అది చూడకుండా ఉండలేను

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ ఫైనల్ సీజన్ ప్రమోషన్‌లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ సందర్భంగా రోహిత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘స్ట్రేంజర్ థింగ్స్’ చివరి సీజన్ ప్రమోషన్ కోసం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ప్రత్యేక వీడియోలో రోహిత్ శర్మ లాకర్ రూమ్‌లో తన జట్టుకు సూచనలు ఇస్తూ కనిపించాడు. క్రికెట్ పరిభాషను సిరీస్‌కు అనుసంధానిస్తూ, “ఫైనల్ సీజన్ వస్తోంది.. ప్రత్యర్థి మైండ్ గేమ్స్ ఆడితే ఏ హెల్మెట్ కూడా కాపాడలేడు” అంటూ డైలాగ్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిరీస్‌లోని ప్రధాన విలన్ ‘వెక్నా’ కోసం తానే ఫీల్డింగ్ సెట్ చేశానని హిట్‌మ్యాన్ సరదాగా వ్యాఖ్యానించాడు.

ఈ ప్రచారంపై స్పందించిన రోహిత్ శర్మ, “నేను చాలా ఏళ్లుగా ‘స్ట్రేంజర్ థింగ్స్’కి పెద్ద అభిమానిని. ఈ సిరీస్ చూడకుండా ఉండలేను. ఇప్పటివరకు ఎంతో ఆసక్తిగా ఈ షోను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు దీని ఫైనల్ సీజన్ ప్రమోషన్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు.

1980ల నేపథ్యంలో సాగే ఈ సిరీస్, హాకిన్స్ అనే కాల్పనిక పట్టణంలో జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ‘అప్‌సైడ్ డౌన్’ అనే మరో ప్రపంచం, రహస్య ప్రభుత్వ ప్రయోగాలతో కూడిన కథాంశం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ చివరి సీజన్ డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *