Revanth Reddy

Revanth Reddy: తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వండి

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కులశ్రేష్ఠ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టనున్న పలు కీలక ప్రాజెక్టుల గురించి చర్చించారు.

ముఖ్యంగా, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) తరహాలోనే ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణం, అలాగే నగరంలో ముఖ్యమైన రేడియల్ రోడ్ల నిర్మాణాల కోసం తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. దీనితో పాటు, భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు వేయనున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, బందరు పోర్టు వరకు నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపైనా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.

గతంలో రాష్ట్రానికి హడ్కో ద్వారా అధిక వడ్డీకి తీసుకున్న రుణాలకు సంబంధించి, వడ్డీని తగ్గించి రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంజయ్ కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మంచి వృద్ధి రేటుతో ఉన్నందున, ఇక్కడి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీతో, ఎక్కువ కాలం చెల్లించేలా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని సీఎం కోరారు.

మరోవైపు, పేదల కోసం నిర్మించబోయే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే కొన్ని రుణాలు మంజూరు చేశామని హడ్కో ఛైర్మన్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేశారు. అయితే, రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం కూడా రుణాలు త్వరగా మంజూరు చేయాలని సీఎం కోరగా, ఛైర్మన్ కులశ్రేష్ఠ దీనిపై కూడా సానుకూలంగా స్పందించారు.

Also Read: Spirit: స్పిరిట్‌లో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్?

చివరగా, ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *