Hyderabad

Hyderabad: మాజీ ఐపీఎస్ భార్య దారుణ హత్య.. నమ్మిన పనిమనిషే ప్రాణాలు తీసింది!

Hyderabad: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో జరిగిన ఓ దారుణ హత్య నగరంలో తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద (55)ను వారి ఇంట్లోనే పనిమనిషి కిరాతకంగా హత్య చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస ప్రాంతంలో ఈ ఘటన జరగడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. వినయ్ రంజన్ కుటుంబం ప్రశాసన్ నగర్‌లోని ఐఏఎస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో పని చేయడానికి నేపాల్‌కు చెందిన కల్పన అనే మహిళను చేర్చుకున్నారు. కొంతకాలంగా ఇంట్లోనే నమ్మకంగా పని చేస్తున్న కల్పన, మే 8వ తేదీ ఉదయం అదును చూసి సునందను అంతమొందించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ హత్యలో కల్పన ఒక్కరే పాల్గొందా లేక నేపాల్‌కు చెందిన ఏదైనా ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితురాలు కల్పన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఈ సమాచారం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక మాజీ పోలీసు ఉన్నతాధికారి ఇంట్లోనే ఇలాంటి ఘోరం జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *