Republic Day 2026:

Republic Day 2026: తెలంగాణ నుంచి ప‌ద్మ అవార్డులు అందుకోనున్న ఆ ఏనిమిది మంది విశేషాలు ఇవే..

Republic Day 2026: గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌ద్మ అవార్డులు ఏడుగ‌రు తెలుగు వారిని వ‌రించాయి. 2026 సంవ‌త్స‌రానికి గాను 131 మందికి ప‌ద్మ అవార్డుల‌ను కేంద్ర ప్ర‌క‌టించింది. విభిన్న రంగాల్లో విశేష సేవ‌లందించిన వారికిఈ పుర‌స్కారాలు ద‌క్కాయి. ఈ జాబితాలో తెలంగాణ‌కు చెందిన గ‌డ్డ‌మ‌నుగు చంద్ర‌మౌళి (సైన్స్‌), దీపికారెడ్డి (నృత్య‌కారిణి), గూడూరు వెంక‌ట్రావు (వైద్యం), కృష్ణ‌మూర్తి బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ (సైన్స్‌, కుమార‌స్వామి తంగ‌రాజ‌న్ (సైన్స్‌, ఇంజినీరంగ్‌), పాల్కొండ విజ‌య్ ఆనంద్‌రెడ్డి (వైద్యం), రామారెడ్డి మామిడి (ప‌శు సంవర్ధ‌క పాడి ప‌రిశ్ర‌మ‌- మ‌ర‌ణానంత‌రం) ఉన్నారు. అదే విధంగా తెలంగాణ‌కు చెందిన యూజీసీ మాజీ చైర్మ‌న్ మామిడాల జ‌గ‌దీశ్‌కుమార్‌కు ఢిల్లీ రాష్ట్ర కోటాలో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ద‌క్కింది. ఈ ఎనిమిది మంది జీవిత విశేషాలు తెలుసుకుందాం.

1) గ‌డ్డ‌మ‌నుగు చంద్ర‌మౌళి (సైన్స్‌): 1959 అక్టోబ‌ర్‌లో ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌లో జ‌న్మించిన గ‌డ్డ‌మ‌నుగు చంద్ర‌మౌళి డీఆర్‌డీవో శాస్త్ర‌వేత్త‌గా ఎదిగారు. ఆకాశ్ మిస్సైల్ రూప‌క‌ర్త‌ల్లో చంద్ర‌మౌళి కూడా ఒక‌రు. నాడు ఇండియ‌న్ మిసైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ క‌లాంతో క‌లిసి ఆకాశ్ క్షిప‌ణిని అభివృద్ధి చేశారు. ఆకాశ్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా, ప్రోగ్రాం డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశారు. 35 ఏండ్ల పాటు దేశ ర‌క్ష‌ణ రంగానికి అందించిన విశేష సేవ‌ల‌కు గాను ఆయ‌న‌కు తాజాగా ప‌ద్మ‌శ్రీ అవార్డును కేంద్రం ప్ర‌క‌టించింది.
2) రామారెడ్డి మామిడి (ప‌శు సంవర్ధ‌క పాడి ప‌రిశ్ర‌మ‌- మ‌ర‌ణానంత‌రం): స‌హ‌క వికాస సంస్థ‌ను స్థాపించిన రామారెడ్డి వ్య‌వ‌సాయం, పాడి ప‌రిశ్ర‌మ నిపుణుడిగా ఎదిగారు. ఎంద‌రో రైతుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ప‌శుపోష‌ణ‌, పాడి ఉత్ప‌త్తి రంగాల్లో త‌న‌దైన ముద్ర వేశారు. పాడిరంగంలో మ‌హిళ‌ను భాగ‌స్వాముల‌ను చేసేందుకు విశేష కృషి చేశారు. పాడి ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న సేవ‌ల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం మ‌ర‌ణానంత‌రం (2025 అక్టోబ‌ర్ 26న మ‌ర‌ణం) ప‌ద్మశ్రీ అవార్డును ప్ర‌క‌టించింది.
3) కుమార‌స్వామి తంగ‌రాజ‌న్ (సైన్స్‌, ఇంజినీరంగ్‌): ఈయ‌న జ‌న్యు సంబంధిత ప‌రిశోధ‌నా శాస్త్ర‌వేత‌. 30 ఏళ్ల‌పాటు హైద‌రాబాద్ సీసీఎండీలో మాన‌వుల జ‌న్యు ర‌హ‌స్యాన్ని ఛేదించేందుకు విశేష కృషి చేశారు. ఆయ‌న కృషికి గాను కేంద్రం ప‌ద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.
4) దీపికారెడ్డి (నృత్య‌కారిణి): 1965 సెప్టెంబ‌ర్ 15న హైద‌రాబాద్ న‌గ‌రంలో జ‌న్మించిన దీపికారెడ్డి ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణిగా ఎదిగారు. ఆమె తండ్రి వీఆర్ రెడ్డి అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియాగా ప‌నిచేయ‌గా, ఆమె త‌ల్లి రాధికారెడ్డి కూడా కూచిపూడి నృత్య‌కారిణి. కూచిపూడి నృత్యరంగంలో ఆమె చేసిన విశేష సేవ‌ల‌కు గాను ఆమెకు ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌రించింది.
5) పాల్కొండ విజ‌య్ ఆనంద్‌రెడ్డి (వైద్యం): 1959 అక్టోబ‌ర్ 20న హైద‌రాబాద్‌లో జ‌న్మించిన విజ‌య్ ఆనంద్‌రెడ్డి ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణుడిగా ఎదిగారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి వైద్య విద్య‌ను పొందిన ఆయ‌న వైద్య‌రంగంలో విశేష కృషి చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న అపోలో క్యాన్స‌ర్ ద‌వాఖాన డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న వైద్య సేవ‌ల‌కు గాను ప‌ద్మ‌శ్రీ అవార్డు వ‌రించింది.
6) గూడూరు వెంక‌ట్రావు (వైద్యం): వైద్య‌రంగంలో గ్యాస్టో ఎంట‌రాల‌జిస్ట్‌గా సేవ‌లందిస్తున్న వెంక‌ట్రావు.. ఎన్నో ర‌కాల శ‌స్త్ర‌చికిత్స‌ల‌తో పాటు మ‌ధుమేహంపై మైక్రో ఎన్‌క్యాప్సులేష‌న్ ప‌రిక‌రాన్ని క‌నిపెట్ట‌డంతో క్రియాశీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న సేవ‌ల‌కు గాను ప‌ద్మ శ్రీ అవార్డు ద‌క్కింది.
7) కృష్ణ‌మూర్తి బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ (సైన్స్‌): సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రంగంలో కృష్ణ‌మూర్తి బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ విశేష సేవ‌లందించారు. ఆయ‌న సేవ‌ల‌కు గాను ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేసింది.
8) మామిడాల జ‌గ‌దీశ్‌కుమార్‌: న‌ల్ల‌గొండ జిల్లా తిప్ప‌ర్తి మండ‌లం మామిడాల గ్రామంలో జ‌న్మించిన జ‌గ‌దీశ్‌కుమార్ ను ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వ కోటాలో పద్మ శ్రీ అవార్డు వ‌రించింది. ఐఐటీ మ‌ద్రాస్ నుంచి ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎంఎస్‌, పీహెచ్‌డీ ప‌ట్టా పొందారు. యూజీసీ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఢిల్లీలోని జేఎన్‌యూ వీసీగా సుధీర్ఘ‌కాలం ప‌నిచేశారు. వివిధ విద్యావిధానాల అమ‌లులో ఆయ‌న పాత్ర ఉన్న‌ది. ఆయ‌న సేవ‌ల‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ద‌క్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *