Removal of Tree: రాత్రికి రాత్రి బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ మీదున్న చెట్టును నరికేశారు ఘరానా వ్యాపారులు. తమ క్లినిక్ వ్యాపారం రోడ్డు మీద వెళ్లేవారికి కనిపించకుండా ఆ చెట్టు, దాని కొమ్మలు అడ్డువస్తున్నాయని ఏకంగా సుమారు 50 ఏళ్ల నాటి చెట్లను నరికి పారేశారు. ఈ నిర్వాకం చేసింది.. లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ఫ్లాంట్ స్టూడియో సెలూన్ నిర్వాహకులుగా తెలుస్తోంది. ఈ చెట్లునాటి సుమారు 50 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే సెలూన్, క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్ర రెడ్డి, శిరీష్ ఆలపాటి అనేవ్యక్తులు రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు.
Removal of Tree: అంతకుముందు రోజు కూడా ఇలాంటి ప్రయత్నం వారు చేస్తున్నట్టు తెలియడంతో కేబిఆర్ పార్క్ అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని వాళ్లను హెచ్చరించారు. అయితే, ఆ హెచ్చరికలను బేఖాతరు చేసి రాత్రి సమయంలో ఈ దుర్మార్గానికి ఒడిగట్టరాని స్థానికులు అంటున్నారు. నిన్న సాయంత్రం పచ్చగా ఉన్న చెట్లు ఈరోజు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు. ఈ దుర్మార్గానికి ఒడి గట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్కులోని అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.