Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. స్టీల్, సిమెంట్‌పై GST 28% నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా సంచి ధర రూ.330-370గా ఉంది. GST తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా కేజీ రూ.70-85 వరకు పలుకుతోంది. కేజీపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13వేల వరకు తగ్గనుంది.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ఒక్కో ఇందిరమ్మ ఇంటికి PM ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.72వేలు ఇస్తోంది. ఇకపై ఉపాధి హామీ ద్వారా రూ.27వేలు చెల్లించనుంది. లబ్ధిదారుకు జాబ్ కార్డు ఉంటే ఇంటి పని కింద 90రోజులు పనిచేసినందుకు రోజుకు రూ.300 చెల్లించనుంది. స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మరో రూ.12వేలు ఇవ్వనుంది. మొత్తం రూ.5 లక్షల్లో కేంద్రం రూ.1.11లక్షలు మంజూరు చేస్తుండగా మిగతా రూ.3.89లక్షలు రాష్ట్రం భరించనుంది.
ఇది కూడా చదవండి: Crime News: విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం
ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లుల కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం ఒక కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటి నిర్మాణ దశలను ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయవచ్చు. బిల్లులు ఎప్పుడు, ఎంత జమ అయ్యాయో పారదర్శకంగా తెలుసుకోవచ్చు. ఈ విధానం వల్ల అనవసర జాప్యం, అవినీతి తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే లక్షకు పైగా ఇళ్ల నిర్మాణాలు (గ్రౌండింగ్) ప్రారంభమయ్యాయి. మొదటి దశలో మంజూరు చేసిన ఇళ్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులు కృషి చేస్తున్నారు. అయితే, కొన్ని చోట్ల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి లేకపోవడం, స్థల వివాదాల వంటి కారణాల వల్ల కొందరు లబ్ధిదారులు స్వచ్ఛందంగా పథకం నుండి తప్పుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రభుత్వం ఈ పథకాన్ని వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి కృషి చేస్తోంది.
