Ranveer Singh: 2025 బాక్సాఫీస్ కింగ్‌గా రణ్‌వీర్ సింగ్!

Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని దాటింది. క్రిస్మస్ పర్వదినం (డిసెంబర్ 25) రోజున ఈ ఘనత సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థలు జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ అధికారికంగా ప్రకటించాయి.

ఈ విజయంతో 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన 9వ భారతీయ చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 21వ రోజు ముగిసే సరికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1006.7 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

భారతదేశంలో ఈ సినిమా రూ.668.80 కోట్ల నెట్ (రూ.789.18 కోట్ల గ్రాస్) వసూలు చేయగా, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ.217.50 కోట్లు వచ్చాయి. దీంతో 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న ‘కాంతార: చాప్టర్ 1’ రికార్డును ‘ధురంధర్’ అధిగమించింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని జియో స్టూడియోస్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ,

“1000 కోట్ల క్లబ్‌లో గర్వంగా అడుగుపెట్టాం. ‘ధురంధర్’ ప్రభంజనం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది” అని పేర్కొంది. చిత్ర పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

ఈ భారీ విజయం నేపథ్యంలో చిత్రబృందం సీక్వెల్‌ను కూడా అధికారికంగా ప్రకటించింది. ‘ధురంధర్ పార్ట్ 2: ది రివెంజ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సీక్వెల్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాతో రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని అందుకుని, షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *