Ranga Reddy: రంగారెడ్డి లో దారుణం..ఆస్థి కోసం సొంత చెల్లిని చంపించిన అన్న

Ranga Reddy: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మండలంలో ఒక మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైన ఘటన వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 34 ఏళ్ల అడ్వకేట్ స్వప్న మరణానికి మరెవరో కాదు, ఆస్తి వ్యామోహంతో కళ్లు మూసుకుపోయిన ఆమె సొంత అన్నయ్య రాజే ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. కేవలం భూమి కోసం కన్న చెల్లెలిని కిరాయి హంతకులతో సుపారీ ఇచ్చి మరీ చంపించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.

ఈ ఘోరానికి గల నేపథ్యాన్ని పరిశీలిస్తే, గత మూడేళ్లుగా స్వప్నకు, ఆమె అన్న రాజుకు మధ్య 10 ఎకరాల పొలం పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి. తల్లి వెంకటమ్మ ఆ పొలంలో 6 ఎకరాలు కొడుకుకు, 4 ఎకరాలు స్వప్నకు పంచారు. అయితే, చెల్లెలికి ఆ నాలుగు ఎకరాలు దక్కడం ఇష్టం లేని రాజు, ఆమెను వదిలించుకోవాలని కుట్ర పన్నాడు. గతంలో రెండుసార్లు రోడ్డు ప్రమాదాలు సృష్టించి ఆమెను చంపాలని ప్రయత్నించగా, స్వప్న అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. శనివారం ఉదయం తన వాటా పొలాన్ని సర్వే చేయించి, అందులో ఒక ఎకరం అమ్మేందుకు స్వప్న సిద్ధమవ్వడం రాజులో మరింత కక్షను పెంచింది.

Also Read: Ghaziabad: ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దన్నారని.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

పొలం వద్ద సర్వే పనులు ముగించుకుని స్వప్న తన తల్లితో కలిసి తిరిగి వస్తుండగా, ముసుగులు ధరించిన దుండగులు కారులో వచ్చి అడ్డుకున్నారు. కళ్లముందే కత్తులు, కర్రలతో దాడి చేసి, బండరాయితో తలపై బాది స్వప్నను అత్యంత క్రూరంగా హతమార్చారు. కళ్లముందే కూతురు ప్రాణాలు పోతుంటే ఆ తల్లి ఆపలేక విలపించిన తీరు పలువురిని కలిచివేసింది. ఈ కేసులో ఇప్పటికే రాజుతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఈ దారుణ హత్యపై తోటి న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే తన అన్న నుంచి ప్రాణహాని ఉందని స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని లాయర్లు ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు, హైదరాబాద్-బీజాపూర్ హైవేపై న్యాయవాదులు భారీ ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తమ వృత్తిలో ఉన్నవారికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *