RGV: ఏదైనా ఒక వివాదం ముదురుతున్నప్పుడు సమాజం అంతా ఒకవైపు ఆలోచిస్తే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మాత్రం దానికి పూర్తి భిన్నమైన కోణాన్ని తెరపైకి తెస్తుంటారు. ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉంటే, మరికొన్ని తీవ్ర విమర్శలకు దారితీస్తుంటాయి. తాజాగా టాలీవుడ్‌ను కుదిపేస్తున్న ‘చుట్టమల్లే’ ఏఐ డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియో వివాదంలోనూ ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించి సరికొత్త చర్చకు తెరలేపారు.
“సెలబ్రిటీలందరూ ఈ విషయంలో సాధించింది ఒక్కటే.. ఆ అభ్యంతరకరమైన వీడియో లింక్‌కు విపరీతమైన పబ్లిసిటీ కల్పించి, కోట్లాది మంది ఆ వీడియోను వెతికి చూసేలా చేయడమే! తెలివైన పనేంటంటే.. ఆ వీడియోను సృష్టించిన నిందితుడిని పట్టుకోవడంపై దృష్టి పెట్టి, వాడిని పట్టుకున్న తర్వాత దాన్ని ప్రచారం చేయాల్సింది. కానీ దానికి బదులుగా, సెలబ్రిటీలంతా వరుసగా ట్వీట్లు చేసి బాధితురాలి గుర్తింపుతో పాటు ఆ వివాదాస్పద కంటెంట్ వైపు అందరి దృష్టి పడేలా చేశారు.. ఇది కూడా ఒక రకంగా నేరమే!”
-
చట్టపరమైన ప్రక్రియలోని జాప్యం:మన చట్టాలు, సైబర్ క్రైమ్ దర్యాప్తు ప్రక్రియలో నిందితుడిని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడానికి కొన్ని రోజులు లేదా వారాల సమయం పడుతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఫిర్యాదు చేసిన కేసుల్లోనూ సాంకేతిక దర్యాప్తుకు సమయం పడుతోంది. ఆ వ్యవధిలో ఏ చర్యలూ తీసుకోకుండా మౌనంగా ఉంటే.. ఆ వీడియో మరింత వేగంగా సర్క్యులేట్ అయి బాధితులకు కోలుకోలేని నష్టం జరుగుతుంది.
-
వార్నింగ్ ఇచ్చే గొంతుకగా సెలబ్రిటీల స్పందన:కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్న ఎన్టీఆర్ లాంటి అగ్ర తారలు ముందుకు వచ్చి “ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం చట్టరీత్యా నేరం.. మీపై లీగల్ యాక్షన్ తీసుకుంటాం” అని హెచ్చరించడం వల్ల సోషల్ మీడియాలో ఆ వీడియోను క్యాజువల్‌గా ఫార్వర్డ్ చేసే లక్షలాది మంది భయపడతారు. నిజానికి ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత పలు గ్రూపులు, అకౌంట్ల నుంచి ఆ వీడియో లింకులు తొలగించబడ్డాయి.
-
బాధితులకు భరోసా & వ్యవస్థలో చలనం:స్టార్లు గళమెత్తినప్పుడే ప్రభుత్వం, సైబర్ విభాగాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు (ఎక్స్, మెటా వంటివి) తక్షణమే మేల్కొని ఆ కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి వేగంగా స్పందిస్తాయి. లేకపోతే ఫిర్యాదులు ఫైళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.
హద్దులు దాటని ప్రచారం – అప్రమత్తత అవసరం..
అంతిమంగా లక్ష్యం ఒక్కటే కావాలి.. ఆ నీచమైన కంటెంట్‌ను సృష్టించిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించడం మరియు అది మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయడం. వర్మ పబ్లిసిటీ కోణంలో లేవనెత్తిన లాజిక్ ఆలోచించదగినదే అయినప్పటికీ.. చట్టం తన పని తాను చేసేంత వరకు సమాజంలో ఆ వీడియో వైరల్ కాకుండా నిలువరించడానికి స్టార్ల గళం కూడా అత్యంత కీలకమనేది ఎక్కువమంది అభిప్రాయం.
The only thing all the celebrities succeeded in , is to publicise and thereby make crores and crores of people see the objectionable link ..The smart thing would have been to concentrate on catching the perpetrator and publicise that ..Instead what they did is to tweet and bring enormous attention to the victim’s identity and the offensive content which is also a crime
— Ram Gopal Varma (@RGVzoomin) October 4, 2026
